కోతికి కొబ్బరి చిప్ప చందాన” మైనర్ల చేతికి భారీ వాహనాలు
భారీ ఎర్త్ మూవర్ ను అధిక వేగంగా నడిపిన మైనర్ బాలుడు
భారీ వాహనాన్ని ఆపి ప్రశ్నించిన స్థానికులతో బాలుడి వాగ్వాదం
మైనర్లకు వాహనాలు ఇవ్వడం, రోడ్డుపై వాహనం నడిపేలా వారిని ప్రోత్సహించడం చట్ట ప్రకారం నేరమని, పోలీసులు ఎన్ని విధాలుగా హెచ్చరిస్తున్నా. వాహనదారులకు చెవికి ఎక్కడం లేదు. మైనర్ లకు బైక్ లు ఇవ్వడమే చుట్టూ విరుద్ధం. అయితే, భారీ వాహనాలను సైతం వారి చేత నడిపిస్తూ కొంతమంది వ్యక్తులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మండల కేంద్రమైన రాయవరంలోని రహదారి పై గత రాత్రి జరిగిన సన్నివేశమే దీనికి సాక్ష్యం. సరిగా బ్రేకులు కూడా అందని మైనర్ల తో భారీ వాహనాలు నడిపించి కొందరు స్వార్థపరులు వారి అవసరాలు తీర్చుకుంటున్నారు. పోలీసులు స్పెషల్ డ్రైవ్ల్ నిర్వహిస్తూ,వాహన తనిఖీలు ఎంతగా చేపట్టినా పెద్దవారి నిర్లక్ష్యంతో రహదారిలో దర్జాగా మితిమీరిన వేగంతో మైనర్లు సరదాకు భారీ వాహనాలు నడుపుతున్నారు. గురువారం రాత్రి మైనర్ బాలుడు అధిక వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతున్న వాహనమైన ఎర్త్ మూవర్ (జె.సి.బి)ను స్థానిక యువకులు ఆపి చూడగా, బాలుడు భారీ వాహనాన్ని నడపడం గమనించారు. వారు అతనిని ప్రశ్నించగా వాహనం నడుపుతున్న బాలుడు,మరొక మైనర్ బాలుడితో కలిసి “నీకు అర్జెంట్ పని ఉంటే నీవు వెళ్ళవా” అని సమాధానం చెప్పడం మరింత చర్చకు దారి తీసింది. ఎర్త్ మూవర్ యజమాని వేగంగా రావాలని మైనర్ బాలుడికి ఆదేశించాడా.? లేక మరి ఏదైనా అక్రమ రవాణా కారణంతో రాత్రి 8:00 గంటలకు మైనర్ బాలుడు భారీ వాహనాన్ని రోడ్డుపై వేగంగా నడుపుతున్నాడా.? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తూ ఉన్న భారీ వాహనదారులను శిక్షించి, వాహనాలను సీజ్ చేయాలని, ఇలాంటి సంఘటనలు ప్రజల భద్రతకు,మనుగడకు ప్రమాదం కనుక ఇలాంటి వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

