సోమేశ్వరం హైస్కూల్లో “డ్రగ్స్ వద్దు బ్రో” కార్యక్రమం
మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్, శక్తి యాప్ అంశాలపై అవగాహన
సోదరిగా భావించి మహిళా పోలీస్ తో సమస్యలు చెప్పండి
విద్యార్థులకు పలు సూచనలు చేసిన ఎస్సై సురేష్ బాబు
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన భారతదేశ విలువైన ముఖ్య సంపద యువత అని, విద్యార్థి దశ నుండి ఉన్నత విలువలు కలిగి. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, దేశ ప్రగతిలో తమ వంతు పాత్ర ఉండేలా ఎదగాలని విద్యార్థులకు రాయవరం ఎస్సై సురేష్ బాబు సూచించారు. రాయవరం మండలం, సోమేశ్వరం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం “డ్రగ్స్ వద్దు బ్రో” కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మాదకద్రవ్యాల పట్ల అవగాహన కల్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి,డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు సక్రమంగా సాగే జీవితాన్ని చిత్తుగా మార్చి దుర్భర పరిస్థితులకు చేరుస్తాయని పలు ఉదాహరణలను విద్యార్థులకు వివరించారు. మత్తు నిచ్చే మాదకద్రవ్యాల విషయంలో జాగ్రత్త ముఖ్యమని, వీటికి అలవాటు పడిన యువకులు క్షణకాలం మత్తులో ఆకృత్యాలకు పాల్పడి, జీవితం కాలం జైలు గోడల మధ్య బాధపడుతున్నారని వివరించారు. విద్యార్థి దశలో ప్రాముఖ్యం గా సినిమాల ప్రభావంతో విద్యార్థులు ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్నారు అని ఈ విధమైన సంస్కృతి వలన తమ తోటి విద్యార్థులకు ఇబ్బంది కలిగించినవారవుతారని, ఎదుటి వారిని హేళన చేస్తూ, హింసించడం నేరం కనుక అట్టి చర్యలకు విద్యార్థులు పాల్పడ కూడదని, స్నేహభావం తో మెలగాలని నేర్పించారు. ఆన్లైన్ మోసాలకు తావివ్వకుండా జాగ్రత్త పడుతూ, సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని హెచ్చరించారు. విద్యార్థినిలు ప్రతి ఒక్కరు శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే శక్తి యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని, వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేసారు. ముఖ్యంగా ప్రతి రెండు రోజులకు ఒకసారి సోమేశ్వరం మహిళా పోలీస్ స్కూల్ కి వస్తారని, ఆ సమయంలో మీకు ఎదురైన ప్రతి సమస్యలను సోదరి గా భావించి, ఆమెకు తెలిపాలని బాలికలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎ ఎస్సై కె.రాంబాబు, కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, సోమేశ్వరం గ్రామ1,2 సచివాలయాల మహిళా పోలీసులు, పాఠశాల అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.