-రూ.14 లక్షల అవినీతి – డిప్యూటీ తహశీల్దార్ సస్పెన్షన్
అనధికార భూ రికార్డుల మార్పులు – ఇద్దరు వీఆర్ఏలపై క్రమశిక్షణా చర్యలు
– కలెక్టర్ పి ప్రశాంతి
మాజీ సైనిక ఉద్యోగి నుండి లేని భూమి ఉన్నట్లు చూపించి రూ.14 లక్షలు లంచం వసూలు చేసిన ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ పి. ప్రశాంతి కఠిన చర్యలు చేపట్టినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేసారు.
గోపాలపురం మండలం ఎలక్షన్ డి టి ప్రస్తుతం కొవ్వూరులో డిప్యూటేషన్ రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్ ఎస్. కృష్ణపై విచారణ పెండింగ్‌లో ఉంచి సస్పెండ్ చేయడమే కాకుండా, ఈ ఘటనలో భాగం అయిన సంబంధిత వీఆర్ఏలు జి. మనోహర్ (కరగపాడు), పి. నాని (గోపాలపురం) పై కూడా క్రమశిక్షణా చర్యలు ప్రారంభించేందుకు గోపాలపురం తహసిల్దార్ కు ఆదేశాలు జారీ చేశామన్నారు.
ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ను కలిసి మాజీ సైనికులు ఇచ్చిన ఫిర్యాదు నేపధ్యంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్(కె ఆర్ ఆర్ సి) కె భాస్కర్ రెడ్డి సమగ్ర విచారణ చేసి నివేదిక అందచేయాలని ఆదేశించడం జరిగిందనీ పేర్కొన్నారు. సదరు దర్యాప్తు అనంతరం ఎస్ డి సి అందచేసిన నివేదికలో రెవెన్యూ రికార్డుల్లో అనధికార మార్పులు చేసి, నకిలీ పట్టాదారు పాస్‌బుక్ జారీ చేసినట్లు నివేదికలో స్పష్టమైందన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజనం దృష్ట్యా సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి తీరు వంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో క్రమశిక్షణ చర్యలు విధానాన్ని కొనసాగిస్తూ, దర్యాప్తులో పాక్షికతకు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు.

