మండల కేంద్రమైన రాయవరంలో మంగళవారం రాయవరం గ్రామంలోని రైతు భరోసా కేంద్రం నందు గ్రామపంచాయతీ సెక్రటరీ దాసరి సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించగా, ఈ కార్యక్రమంలో పలు సమస్యలు, వాటి పరిష్కారం గూర్చి చర్చించారు. ముఖ్యంగా రాయవరం మండలాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి వేరుచేసి, రాజమహేంద్రవరం కేంద్ర స్థానంగా గల తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలని, ముక్తకంఠంతో విన్నపాలు తో కూడిన పత్రాలను పలు ప్రజా సంఘాల కార్యకర్తలు, గ్రామ పంచాయితీ సెక్రటరీ దాసరి సత్యనారాయణ కు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య, వైద్య , వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఉంటూ, ప్రయాణానికి అనుకూలంగా ఉండే రాజమహేంద్రవరం లో తమ మండలాన్ని మమేకం చేయాలని, కోనసీమ జిల్లా కేంద్రంగా గల అమలాపురం వెళ్లి రావడం వలన అధిక వ్యయ, ప్రయాసలకు గురవుతున్నామని వాపోయారు, వృద్ధులు, వికలాంగులు ఇతర శరీర దౌర్బల్యం కలిగిన వారు అంత దూరం ప్రయాణం చేయడం కష్టతరంగా ఉందని, ఏదైనా సర్టిఫికెట్ లేదా ఆర్జీల సమర్పణ కోసం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి రావాలంటే ఒకరోజు సమయం పడుతుందని, ముఖ్యంగా వర్షాకాలంలో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. దీనికి పరిష్కారంగా రాయవరం మండలాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయడం ద్వారా, ఆ శ్రమ కొంతమేర తగ్గుతుందని, అధికారులు స్పందించి సత్వర సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలను అందించారు.

