పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్ సిబ్బందితో ప్రజలు సహకరించాలి – మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్ సిబ్బందితో ప్రజలు సహకరించాలని కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొవ్వూరు పట్టణంలోని రెండవ వార్డ్ లో డ్రైనేజీ నిండి నీరు రోడ్డుపై ప్రవహించడం తో సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి రెండవ వార్డులోని డ్రైనేజీలను పరిశీలించి మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ భావన రత్నకుమారి మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ మున్సిపల్ సిబ్బంది చేస్తారులే అనే భావనతో ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను తడి పొడి చెత్త లను డ్రైనేజీలలో వేయడం వలన చెత్త అడ్డుపడి నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో వర్షాలు పడే సమయంలో డ్రైనేజీ నిండి రోడ్లపై ప్రవహిస్తుందని అన్నారు. ప్రతినిత్యం పారిశుద్ధ్య కార్మికుడు ప్రతి ఇంటికి వచ్చి చెత్తను సేకరిస్తున్నప్పటికీ డ్రైనేజీలలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వేయడం సరికాదన్నారు. వార్డులోని మెయిన్ డ్రైనేజీ కూడలిలో లారీ టైరు డ్రైనేజీలో చిక్కుకుపోయి దాన్ని ద్వారా నీరు ముందుకు వెళ్లే మార్గం లేకపోవడంతో వర్షం నీరు రోడ్లపై ప్రవహించిందన్నారు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో శ్రద్ధ వహించాలని మున్సిపల్ సిబ్బందితో సహకరించి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఒకటవ వార్డు కౌన్సిలర్ బొండాడ సత్యనారాయణ సచివాలయ సిబ్బంది మున్సిపల్ శానిటరీ సిబ్బంది వార్డులోని ప్రజలు పాల్గొన్నారు.

