గత సంవత్సరం చారిత్రాత్మక సమ్మె లో ఇచ్చిన మాట మరిచారు
నల్ల చీరలు ధరించి ప్రభుత్వాల తీరుపై మానవహారంగా ఏర్పడి అంగన్వాడీ ల నిరసన
ఫేస్ యాప్ సహా పలు సమస్యలకు పరిష్కారం కోరుతూ ఎమ్మార్వో కు వినతిపత్రం
ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా, అన్ని పనులకు అంగన్వాడీ వర్కర్లను ఉపయోగించుకుంటూ అందుకు అవసరమైన వసతులను సమకూర్చకుండా, అదనపు పని భారంతో ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతుందని ఆల్ ఇండియా అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆదేశాల మేరకు, గురువారం మండల కేంద్రమైన రాయవరంలో, మండల అంగన్వాడీ యూనియన్ కార్యకర్తలు నల్ల చీరలు ధరించి నినాదాలు చేస్తూ,మానవహారం గా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం పలు సమస్యల తో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మార్వో ఐపి శెట్టి కి అందించారు. వినతి పత్రం లోని సమస్యలను పత్రికా ముఖంగా వారు తెలియజేస్తూ, భారతదేశ వ్యాప్తంగా 2014 నుండి కేంద్ర ప్రభుత్వం, 2019 నుండి రాష్ట్ర ప్రభుత్వం తమపై పని భారం పెంచాయే తప్ప, వేతనాలు పెంచలేదని, తామంతా కలిసి గత సంవత్సరం లో 42 రోజుల చారిత్రాత్మకమైన సుదీర్ఘ సమ్మె చేయగా జూలై నెలలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి, ఏడాది గడిచినా ప్రభుత్వం నోరు మెదపడం లేదని వాపోయారు. 2022 లో ఇచ్చిన మొబైల్ ఫోన్స్ సరిగ్గా పని చేయక అంగన్వాడి సెంటర్ నిర్వాహకులు గా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పాత ఫోన్లు కావడం, పోషణ ట్రాకర్, బాల సంజీవని వంటి యాప్ లు, అప్గ్రేడ్ వెర్షన్ అవ్వడంతో మొబైల్ ఫోన్లు సపోర్ట్ చేయడం లేదని, పైగా యాప్ లలో ఎప్పటికప్పుడు అప్లోడ్ చెయ్యకపోతే సరుకులు ఇవ్వము అని చెప్పటం తమను మరింత ఇబ్బంది కి గురి చేస్తుందన్నారు. పదవ తరగతి కనీస విద్యార్హత తో చేరిన అంగన్వాడీ కార్యకర్తలకు కఠినమైన పదాలు అర్థం కావడం లేదని, మారుమూల గ్రామ ప్రాంతాలలో నేటికీ సిగ్నల్స్ రాక మేము ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, అధికారులు మాత్రం ఏమి పట్టనట్లు తమపై ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. గర్భిణులు,బాలింతలు చిన్న పిల్లల కు పేస్ యాప్ రద్దు చేయాలని, లబ్దిదారులు అంగన్వాడీ సెంటర్ కు సరుకుల నిమిత్తం వచ్చినప్పుడు సిగ్నల్ రాక, సర్వర్ పనిచేయక ఇబ్బంది పడుతున్నామని, లబ్ధిదారులకు అందించే సరుకులన్నీ ఒకసారి రాకపోవడంతో, పలుమార్లు లబ్ధిదారులను పిలుస్తుంటే, లబ్ధిదారులు కూడా తమపై అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాలు తమ సమస్యలను గుర్తించాలని, ముఖ్యంగా వేతనాలను పెంచి, మినీ అంగన్వాడి వర్కర్లను మెయిన్ వర్కర్లు గా మార్చుతూ జీవో విడుదల చేయాలన్నారు, అన్ని యాప్ల్ కలిపి ఒక యాప్ గా మార్చాలని, ఫేస్ యాప్ లో ఇన్,అవుట్ లను రద్దు చేయాలని, అంగన్వాడి సెంటర్ నిర్వాహకులకు 5జి నెట్వర్క్ తో కూడిన ట్యాబ్ లను అందించాలని, కొత్తగా చేరిన నిర్వాహకులకు ప్రధానమంత్రి మాతృ వందనం పథకం కు సంబంధించిన పనులు అప్పగించరాదని, గ్రాడ్యుటి జీవోలో మార్పులు చేసి, హెల్పర్లు ప్రమోషన్ల ను పొందడానికి గైడ్లైన్స్ రూపొందించడం తో పాటు తమను ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు అర్హులుగా చేర్చాలని వినతిపత్రం ద్వారా పలు సమస్యలను ఎమ్మార్వో కు అందించి, ఈ సమస్యలపై ప్రభుత్వాలు వెంటనే అంగన్వాడి యూనియన్స్ ను చర్చలకు ఆహ్వానించి, సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయవరం మండల అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎస్. కృష్ణకుమారి, డి. ఆదిలక్ష్మి, సిహెచ్. సత్యవేణి, ఎస్. నూకరత్నం, కె. కమల రాయవరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు.

