posted on Oct 21, 2024 2:44PM
కేసీఆర్… ఈ మాట వినగానే నిన్నమొన్నటి వరకూ అందరి నోటా మాటల మాంత్రికుడు, రాజకీయ చాక్యుడు.. ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందే ఉంటారు. వారు వ్యూహ రచన చేయడానికి ముందే వాటికి విరుగుడు వ్యాహాలను అమలు చేసి వారిని నిరుత్తరులను చేస్తారు. అన్న మాటలే వినిపించేవి. అయితే ఇదంతా బీఆర్ఎస్ ఎన్నికలలో ఓడిపోయి ప్రతిపక్షానికే పరిమితం కావడానికి ముందు వరకూ మాత్రమే. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ రాజకీయాలను తట్టుకోవడం కష్టమని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరించేసిన పరిస్థితి.
అయితే ఒక్క ఓటమి.. ఔను ఒకే ఒక్క ఓటమి కేసీఆర్ ను నిర్వీర్యుడిగా మార్చేసింది. ఆయనలో వ్యూహ శూన్యత నెలకొని ఉందా అన్నట్లుగా ఆయన క్రియా శూన్యుడిగా మారిపోయారు. ఆయన ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాల సంగతి పెడితే అసలాయనకు రాజకీయాలలో ఓనమాలు తెలుసునా అన్న అనుమానాలు బీఆర్ఎస్ లోనే వ్యక్తం అవుతున్నారు. తెలంగాణలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి పది నెలలు కావస్తున్నది. ఈ పది నెలల కాలంలోనూ కేసీఆర్ ప్రజలలోకి వచ్చి వారికి కనిపించిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సాహసం కూడా చేయలేదు. ఏదో మొక్కుబడికి అన్నట్లు ఒక్క రోజు మాత్రం అదీ రేవంత్ సర్కార్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు హాజరయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన రాజకీయ సన్యాసం చేసేశారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాలే ఆయన తీరు ఉంది. గత పది నెలలుగా ఆయన ఒక విధంగా వానప్రస్థంలో ఉన్నట్లుగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఆయన పథకాలైన రుణమాఫీ, రైతు భరోసా వంటి వాటిలో రేవంత్ సర్కార్ వైఫల్యాలపై ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయన కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులే చక్కబెడుతున్నారు. మళ్లీ వీళ్లద్దరి మధ్యా ఆధిపత్య పోరు సాగుతోంది. అది వేరే సంగతి.
ఇప్పటి వరకూ ఇప్పుడు కాకపోతే మరోసారి. ఇవ్వాళ కాకపోతే రేపు కేసీఆర్ మళ్లీ ప్రజలలోకి వస్తారు. బీఆర్ఎస్ కు పూర్వ వైభవం తీసుకువస్తారు అని బీఆర్ఎస్ శ్రేణులూ, కేసీఆర్ అభిమానులూ నమ్మకంగా ఉన్నారు. కానీ హైడ్రా వివాదం సమయంలో కూడా కేసీఆర్ ప్రజలకు ముఖం చూపకపోవడంతో వారిలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పరిశీలకులు అయితే ఆయన రాజకీయంగా అస్త్రసన్యాసం చేసినట్లేని విశ్లేషిస్తున్నారు.
ఇందుకు ఉదాహరణగా కేటీఆర్ మూసీపై మీడియా సమావేశంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను చూపుతున్నారు. ఆ సందర్భంగా బీఆర్ఎస్ లోగోలో కేసీఆర్ ఫొటోకు బదులుగా కేటీఆర్ ఫొటో ఉండటాన్ని చూపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ పూర్తిగా టేకోవర్ చేసేకుకున్నారనీ, కేసీఆర్ ఇక రాజకీయాలలో మళ్లీ చురుగ్గా పాల్గొనే పరిస్థితి కనిపించడం లేదనీ అంటున్నారు. అలాగే తెలంగాణ భవన్ లో కూడా పార్టీ లోగోలో కేసీఆర్ ఫొటో స్థానంలో కేటీఆర్ ఫొటో కనిపిస్తోంది. మొత్తానికి కేసీఆర్ మౌనం, కేటీఆర్ దూకుడు చూస్తుంటే నేడో, రేపో అధికారికంగా పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ అన్న ప్రకటన వెలువడినా ఆశ్చర్యపోవలసిన పని లేదంటున్నారు. అదే సమయంలో హరీష్, ఆయన వర్గం ఏం చేస్తారన్నదానిపై కూడా పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ కేటీఆర్ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టకపోవడానికి హరీష్ వర్గం అభ్యంతరాలే కారణమని అంటున్నారు. పార్టీ శాసనసభా పక్ష నేత ఎన్నిక విషయంలో కూడా కేటీఆర్ కు సంపూర్ణ మద్దతు లేకపోవడం వల్లే ఇప్పటికీ కేసీఆర్ శాసనసభాపక్ష నేతగా కొనసాగుతున్నారని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ లో చీలిక అనివార్యం అనే అనిపిస్తోందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.