ఇటీవల బోధిధర్మ అవార్డు అందుకున్న న్యూ డ్రాగన్ చైనీస్ కుంగ్ ఫు గ్రాండ్ మాస్టర్ పిట్ట రాజబాబు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవిని అలంకరించిన టీడీపీ నాయకుడు మాజీ కౌన్సిలర్ మందపల్లి చంద్రశేఖర్ ( దొరబాబు) లకు చిన్ననాటి స్నేహితులు ఘన సన్మానం చేశారు. 1990-91 బ్యాచ్ కు చెందిన పదవ తరగతి విద్యార్థులంతా సేవా దృక్పథంతో ఏర్పాటుచేసిన స్నేహ సౌరభం కమిటీ ఆధ్వర్యంలో ఇరువురి మిత్రులకు సన్మానం ఏర్పాటు చేశారు. సూర్యామహల్ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన ఈ సత్కార సభలో వ్యాఖ్యాతగా పూర్వ విద్యార్థి గండి స్వామి ప్రసాద్ వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు రాజబాబు దొరబాబులను ఉద్దేశించి మాట్లాడారు. చిన్నతనం నుంచి ఈ ఇద్దరు మిత్రులు కూడా ఎలాంటి విభేదాలు లేకుండా అందరితో కలిసి మెలిసి ఉండేవారన్నారు. రాజబాబు చిన్నతనం నుంచి కుంగ్ ఫూలో ప్రావీణ్యం సంపాదిస్తే, దొరబాబు రాజకీయ నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. కుంగ్ ఫూ కళను తన వద్దే ఉంచుకోకుండా పదిమందికి పంచి పెట్టిన గొప్ప వ్యక్తి రాజబాబు అని కొనియాడారు. వందలాది మంది విద్యార్థులను కుంగ్ ఫూలో మంచి ఫైటర్లుగా తీర్చిదిద్ది గురువుకు అర్థం చెప్పిన మహోన్నత వ్యక్తి రాజబాబు అని కీర్తించారు. ఆ విద్య ద్వారా ఎంతో మందికి జీవనోపాధి కూడా కల్పించారని అన్నారు. అటువంటి గొప్ప వ్యక్తికి అరుదైన బోధిధర్మ అవార్డును మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అసోసియేషన్ కట్టబెట్టడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా మిత్రుడు రాజబాబును సత్కరించుకోవడం తామందరికి ఆనందంగా ఉందన్నారు. అలాగే దొరబాబు కూడా రాజకీయాల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం స్నేహితులంతా ఇరువురిని సాలువాలు పుష్పమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. అలాగే ఆయన శిష్యుడు తెగడ సత్తిబాబు బుద్ధుడి విగ్రహాన్ని జ్ఞాపికగా అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పెందుర్తి ప్రదీప్ కుమార్, పూర్వ విద్యార్థులు, కుంగ్ ఫూ విద్యార్థులు పాల్గొన్నారు.

