మదర్ థెరిస్సా ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని జిల్లా వాలంటరీ బ్లడ్ అండ్ ఐ డోనర్స్ అద్యక్షులు వెలగల ఫణికృష్ణారెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం లో దళిత కాలనీలో మదర్ థెరిసా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మదర్ థెరిస్సా 115వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తొలుత మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కుష్ఠు బాధితులకు ఆమె అందించిన సేవలు మరువలేనివని. పేదలందరినీ ఆమె అమ్మలా ఆదరించారని గుర్తుచేశారు. తన సేవలతో గుర్తింపు పొందిన ఆమె అందరికీ అమ్మగా మారారని ప్రతి ఒక్కరూ మదర్ థెరిస్సా సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆమె చూపిన మార్గంలోనే నడుస్తూ, పలువురిని ఆదరించి వారికి సహాయపడుతున్న స్థానిక మదర్ థెరిస్సా యూత్ వారిని ఆయన అభినందించారు. కరోనా కష్ట కాలంలో భయపడి ఇంట్లోనే ఆగిపోకుండా, రోడ్డు ప్రక్కల ఉండే అభాగ్యులకు ప్రతీ రోజు అన్నదానం చేసి ఆకలి తీర్చారని గుర్తుచేస్తూ యూత్ సభ్యులను కొనియాడారు. తదుపరి కేట్ కటింగ్ చేసి స్థానిక పాఠశాలలోని చిన్నారులకు తినిపించి,వారికి చాక్లెట్స్ అందించారు. మదర్ థెరిస్సా జయంతి వేడుకలను పురస్కరించుకుని యూత్ సభ్యులు స్థానికులకు స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ చంద్రమల్ల సంజయ్ రాజు, వైస్ ప్రెసిడెంట్ దువ్వ చంద్రశేఖర్, సెక్రటరీ కందుకూరు గంగరాజు, జాయింట్ సెక్రటరీ పలివెల సురేష్, ట్రెజరర్ చంద్రమల్ల రాజు, యూత్ సభ్యులు సుధాకర్, వీరబాబు, బాలు, అనిల్, స్థానిక వృద్ధులు, చిన్నారులు పాల్గొన్నారు.

