ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆశావర్కర్ల నిరసన కార్యక్రమం
ఆరోగ్య కేంద్ర సిబ్బంది కి వినతిపత్రం అందజేత
కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశావర్కర్లు గా మార్పు చేసి, అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని కోరుతూ,మండల కేంద్రమైన రాయవరంలో గల స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశావర్కర్ల యూనియన్ లీడర్ జి.దుర్గ ఆద్వర్వంలో ఆశావర్కర్లు నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా యూనియన్ లీడర్ దుర్గ మాట్లాడుతూ ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని రకాల జాతీయ సెలవులు, పండుగ సెలవులు, వారాంతపు సెలవు, క్యాజువల్ శెలవులు, మెడికల్ శెలవులు వంటివి తమకివ్వాలని, నాణ్యమైన యూనిఫామ్ లు తమకివ్వాలని, ఏఎన్ఎం, జిఎన్ఎం శిక్షణ పొందిన ఆశా లకు పర్మినెంట్ పోస్టుల భర్తీ సమయంలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆశావర్కర్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల నియామకాలను ప్రభుత్వాలే చేపట్టాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. తమతో వెట్టిచాకిరి చేయిస్తూ రికార్డ్స్ వంటి అదనపు పనులు చేయిస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని, ఆశావర్కర్ల దహన సంస్కారాల ఖర్చులకు గానూ రూ. 20,000 చెల్లించాలని పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆరోగ్య కేంద్ర సి.హెచ్.వో ప్రభావతి కి అందించారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్ల యూనియన్ ప్రెసిడెంట్ పంపన మంగాదేవి, సెక్రటరీ జె.అనంతలక్ష్మి ఆశావర్కర్లు రమా, రజిని,లక్ష్మీ తదితర ఆశావర్కర్లు పలువురు పాల్గొన్నారు.