వల్లూరులో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ…
రేషన్ కార్డు దారులకు స్మార్ట్ రేషన్ కార్డులు ద్వారా సేవలు అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వీటిని అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ పేర్కొన్నారు. కపీలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులు ఆయన పంపిణీ చేశారు. అర్హులందరకీ గ్రామ సచివాలయల సిబ్బంది పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి పారదర్శకతతో ప్రజా పంపిణీ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. గతంలో లా కాకుండా ప్రతి నెల అన్ని రోజులు రేషన్ సరుకులు ఇస్తున్నారని పేర్కొన్నారు. వృద్ధులు, వికలాంగుల ఇళ్ళకు వెళ్ళి సరుకులు పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. కార్డులు అందరకీ వస్తాయని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. క్యూర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డు వల్ల పౌరసరఫరా వ్యవస్దలో పారదర్శకత తీసుకు రానున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి పనులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ముందుకు వెళుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కూటమి నాయకులు, వి.ఆర్.ఓలు, పంచాయితీ, రెవెన్యూ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

