రాష్ట్రంలో నూతనంగా పంపిణీ జరుగుతున్న స్మార్ట్ రేషన్ కార్డుల లో ముద్రించిన జిల్లా పేరు పై ఆందోళన చెందవద్దని రాయవరం మండలం తహశీల్దార్ ఐపి శెట్టి శనివారం ప్రకటన ద్వారా తెలిపారు. రాయవరం మండలం వ్యాప్తంగా గురువారం నుండి లబ్దిదారులకు అందచేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారుల ఆధార్ సంబంధిత వివరాలతో నమోదు చేయబడిన కారణంగా వారి ఆధార్ కార్డులో తూర్పుగోదావరి జిల్లా పేరు కొనసాగుతుండడంతో అదే జిల్లా పేరు స్మార్ట్ రేషన్ కార్డులో కనబడుతుందని ఆయన తెలిపారు. కాగా ఇప్పటికే ఆధార్ అప్డేట్ లో అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును మార్చుకుని అప్డేట్ చేసిన వారికి కోనసీమ జిల్లా పేరుతో స్మార్ట్ రేషన్ కార్డు వస్తుందని వివరించారు. దీనివలన ఎటువంటి ఇబ్బంది తలెత్తదని, త్వరలోనే స్మార్ట్ కార్డులను సవరించే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తుందని, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డు విషయంలో సమస్యలు తలెత్తితే స్థానిక సచివాలయంలో సంప్రదించాలని ఎమ్మార్వో ఐపి శెట్టి సూచించారు.