విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు చేస్తున్న అధికారులపై నమ్మకం లేదని కాకినాడ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డోకుబుర్ర భద్రం తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన కేంద్రమైన రాయవరం పోలీస్ స్టేషన్లో మంగళవారం నాడు మాదిగ ఆత్మగౌరవ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రామచంద్రాపురం డి.ఎస్.పి బాలచంద్రారెడ్డికి సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వల్లూరి నాని మాదిగ , కాకినాడ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డోకుబుర్ర భద్రం తమ ఆవేదన తెలియజేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ చెల్లూరు గ్రామానికి చెందిన బొడ్డపాటి రామారావుపై అదే గ్రామానికి చెందిన డాక్టర్ నిడదవోలు కృష్ణారావు (చిట్టిబాబు) దాడి చేస్తే అదే రోజు సాయంత్రం రామారావుకు న్యాయం చేయాల్సిన ఎస్ఐ సురేష్ అగ్రవర్ణానికి చెందిన కృష్ణారావుకు కొమ్ముకాస్తూ బాధితుడి పైనే తప్పుడు కేసులు నమోదు చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయడమేనని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దళితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు భయపడాల్సిన పరిస్థితి రాయవరం మండలంలో ఉందన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్ఐ సురేష్ పై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సోమేశ్వరం గ్రామం దళిత సామాజి వర్గానికి చెందిన గుత్తుల లక్ష్మి అత్తింటి వారు తనను కులం పేరుతో వేధించారనే ఫిర్యాదును పక్కన పెట్టి ఆమెపైనే తిరిగి ఆమెపై తప్పుడు కేసు నమోదు చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను దర్యాప్తు చేస్తున్న రామచంద్రాపురం డి.ఎస్.పి పై తమకు నమ్మకం లేదని అన్నారు. దళితులకు న్యాయం జరగలేని పక్షంలో రాయవరం పోలీస్ స్టేషన్ ఎదుట ఆమరణ దీక్షకు దిగుతామని నాని మాదిగ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిడిగట్ల వెంకట్రావు మాదిగ , దళిత , గిరిజన , ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ నాయకులు ఖండవిల్లి డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.