ధాన్యం కొనుగోలు కేంద్ర వద్ద రైతులు ధర్నా…
చెల్లూరు గ్రామ రైతులు డిమాండ్…
విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
https://viswamvoice.com/wp-content/uploads/gravity_forms/5-1c875ca9512b4c4ae02d5834cbf9c719/2022/11/IMG-20221128-WA0039.jpgరాత్రీ, పగలు ఆర్‌బికెల వద్ద పడిగాపులు పడలేమంటూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. సోమవారం మండలం చెల్లూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. సుమారు రెండు గంటలపాటు బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అధికంగా గోనె సంచులు అవసరముండగా అతి తక్కువ సంచులు మాత్రమే అందుబాటులో ఉంచారని తెలిపారు. రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదుకావడం లేదన్నారు. రాత్రీ, పగలు ఆర్‌బికెల వద్ద పడిగాపులు పడలేమంటూ రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్ బి కే కేంద్రం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. చెల్లూరు గ్రామంలో పండించిన ధాన్యాన్ని స్థానికంగా ఉన్న రైస్ మిల్లులకు మాత్రమే చేరవేయాలని, ఆఫ్లైన్లో ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు వెంటనే ఆన్లైన్ చేసి డబ్బులు ఖాతాలో జమ చేసేలాగా చూడాలని, చెల్లూరు గ్రామంలో సుమారుగా 3 వేలు ఎకరాలు వరుస ఆయకట్టు ఉందని ఆర్బికే కేంద్రానికి వ్యవసాయ సహాయకులు కొరత ఉందని వెంటనే సిబ్బందిని ఏర్పాటు చేయాలని, రైతులకు వేరువేరు లాగిన్ లలో ఆన్లైన్ అవడంతో ధాన్యం బస్తాలు చేరవేసే తరుణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. విషయం తెలుసుకున్న తహసిల్దార్ కే.జే ప్రకాష్ బాబు, మండల వ్యవసాయ అధికారి కే ప్రభాకర్ లు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద చేరుకుని వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులు సమస్యలను అతి తొందరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అకాల వర్షాలు ముంచెత్తడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా తమను ఏవ్వరూ పట్టించుకోలేదని, మాకు ఆత్మహత్యలే శరణ్యమంటూ , ధాన్యం అమ్మిన సొమ్ములు ఇంకా అందకపోవడంతో దాల్వా పంటకు పెట్టుబడులు పెట్టడం కష్టదాయకంగా ఉంటుందని అధికారులు దగ్గర రైతులు విన్నవించుకున్నారు. అధికారులు స్పందించి రైతుల వివరాలను ఆఫ్‌లైన్‌లో నమోదు చేయాలని, వీలైనంత తొందరలో ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించాలని చెల్లూరులో పండించిన ధాన్యాన్ని స్థానిక రైస్ మిల్లులకు పంపించే ఏర్పాటు చేయాలని తహసిల్దారు, మండల వ్యవసాయ అధికారి ఉన్నతాధికారులతో ఫోన్లో తెలియజేశారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో చెల్లూరు గ్రామ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.