విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ గ్రామీణ, విశ్వం వాయిస్ః
పుస్తక పఠనం వలన మానసిక ఆనందం, విజ్ఞానం, వివేకం మన సొంతం అవుతాయని గ్రంథాలయ మాజీ ఉద్యోగి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. శనివారం సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ పుస్తక దినోత్సవం పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పుస్తకాలు చదవడం వలన కలిగే మానసిక ఆనందాన్ని తెలుసుకునేలా చేయడమే ప్రపంచ పుస్తక దినోత్సవం మౌలిక లక్ష్యమని అన్నారు. పుస్తక పఠనం వలన జ్ఞాన వికాసం పెంపొందుతుందని వ్యక్తిని, సమాజాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. పుస్తకాలు చదవడం వలన మనలో ఉండే అజ్ఞానం తొలగి వివేక వంతులను చేస్తుందన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సంయమనంతో ఆలోచించే సద్గుణం పుస్తక పఠనం వలన లభిస్తుందన్నారు. ఏ పుస్తకాన్ని అయినా తపనతో, ఆసక్తితో చదవాలని సుబ్బారావు తెలిపారు. అనంతరం పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, న్యాయవాది యనమల రామం, పట్నాయక్, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.