విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
పదవ తరగతి పరీక్షలలో భాగంగా బుధవారం నిర్వహించిన తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూనిట్ గా పరిగణించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.మొత్తం 66,680 మంది విద్యార్థులు పరీక్ష వ్రాసేందుకు నమోదు చేసుకోగా ఈ రోజు పరీక్షకు 65,703 మంది హాజరయ్యారు.977మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 358 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా జిల్లా అధికారులు,విద్యా శాఖ అధికారులు 96 కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి మాల్ ప్రాక్టీసు చోటుచేసుకోలేదు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సాలిపేట మునిసిపల్ బాలికల ఉన్నత పాఠశాల, గాంధీనగర్ మునిసిపల్ ఉన్నత పాఠశాల సందర్శించి పరిశీలించారు. కలెక్టర్ వెంట ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వి. రాజశేఖర్, అర్బన్ తాసిల్దార్ వై.హెచ్. ఎస్.సతీష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. స్థానిక డీఈవో డి.సుభద్ర, డిఆర్వో,పాఠశాల విద్య ఆర్జేడీ డి.మధుసూదన్ రావు తదితరులు వివిధ పరీక్షా కేంద్రాలు తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ ఎమ్. రవీంద్రనాథ్ బాబు, నగరంలోని వివిధ పాఠశాలలు సందర్శించారు. ఆయా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు పలు సూచనలు చేశారు.