విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంకవరం:
శంఖవరం, ఏప్రిల్ 27, (విశ్వం వాయిస్ న్యూస్) :
పదో తరగతి పరీక్షలకు తొలి రోజే నలుగురు గైర్హాజరు అయ్యారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలంలోని మొత్తం పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షార్ధులో నలుగురు విద్యార్ధులు గైర్హాజరు అయ్యారు. శంఖవరం మండలం మొత్తం మీద 785 కి గాను 781 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు అయ్యారు. ఈ మండలంలోని పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాసేందుకు గాను నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రం శంఖవరంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు పరీక్షా కేంద్రాలు, కత్తిపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒకటి, అన్నవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోకటి చొప్పున పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతే గాకుండా శంఖవరం మండలంలోని కొంత మంది పరీక్షార్ధులకు తుని నియోజకవర్గం తొండంగి మండలం బెండపూడిలోని జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పరీక్షాకేంద్రాన్ని కేటాయించారు. అన్నవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రం నుండి ఇద్దరు, బెండపూడిలోని జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రం నుండి మరో ఇద్దరు విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు అయ్యారు. పరీక్షార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని, మొత్తం నలుగురు పరీక్షార్ధులు గైర్హాజరు అయ్యారని, మండలంలోని పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నామని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగు తున్నదని శంఖవరం మండల విద్యాశాఖ అధికారి సూరిశెట్టి వెంకటరమణ స్థానిక మీడియాకు సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.