విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ గ్రామీణం, విశ్వం వాయిస్ః
రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీ లో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ బోండా సూర్యారావు మాట్లాడుతూ 1820 మే 12న ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు. నైటింగేల్ ధనిక కుటుంబంలో పుట్టి నా ప్రజలకు సేవ చేయాలనే బలమైన కాంక్షతో నర్సింగ్ వృత్తిని చేపట్టారని అన్నారు. అడబాల ట్రస్ట్ అధ్యక్షులు అడబాల రత్న ప్రసాద్ మాట్లాడుతూ కరోనా వైరస్ ఉదృతంగా ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించి ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు విశేష సేవలు అందించారని అన్నారు. ఏఎన్ఎం హేమ మాట్లాడుతూ నర్సింగ్ వృత్తిని ప్రజలకు సేవ చేయడానికి భగవంతుడిచ్చిన ఒక వరంగా భావిస్తున్నామని అన్నారు . కరోనా వైరస్ మొదటి విడత రెండో విడత లో కూడా తామంతా ఐసోలేషన్ లో ఉన్న రోగుల వద్దకు వెళ్లి మందులు వగైరా అందించి బాధ్యతాయుతంగా, సేవా దృక్పథంతో సేవలు అందించామని తెలిపారు. అనంతరం అడబాల సౌజన్యంతో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో రేలంగి బాపిరాజు, రాజా, కృష్ణ మోహన్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.