విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:
అమరావతి, విశ్వం వాయిస్ః
పెట్రోల్, డీజిల్, నిత్యవసర సరుకులతో పాటు అన్ని ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చికెన్ ధర దూసుకుపోతోంది. మార్కెట్లో కిలో చికెన్ ధర రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఏపీ, తెలంగాణలో కిలో చికెన్ ధరలు మండిపోతున్నారు. ఏపీలోని విశాఖలో కిలో ధర రూ.312కు చేరి ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తోంది. అటు తెలంగాణలో స్కిన్‌లెస్ కిలో చికెన్ ధర రూ.304 దాటింది. మే 1న రూ.238 ఉన్న ధర..గత పది రోజుల్లో రూ.74 వరకు ఎగబాకింది. ఎండల తీవ్రత, పెళ్లిళ్ల సీజన్ కావడంతో మార్కెట్లో డిమాండ్‌కు సరిపడ చికెన్ కొరత ఏర్పడటంతో ధరలు పెరుగుతున్నట్లు చికెన్ వ్యాపారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. మామూలుగా వేసవిలో 45 రోజులకు సగటున కోడి రెండు కిలోలు అవుతుంది. కానీ ఇప్పుడు కిలోన్నర కూడా రావడరం లేదని, ఫారంలో ఉంచితే ఎండకు చనిపోతాయోమోనన్న భయంతో వెంటనే అమ్మేస్తున్నామని చెబుతున్నారు. ఒక కోడి పిల్ల.. కిలోన్నర కావడానికి 39 నుంచి 40 రోజులు పడుతుంది. కానీ ఈ సంవత్సరం మార్చి నెల నుంచే ఎండలు తీవ్రంగా ఉండటంతో పిల్ల దశ నుంచి కోడి దశకు ఎదగడానికి 45 నుంచి 60 రోజుల వరకు పడుతోందని పౌల్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని, చాలా చోట్ల కూలర్లు, ఏసీలు పెడితే కానీ కోడి పిల్లలు బతికే పరిస్థితి లేదని అంటున్నారు. అయితే నీటి వసతులు లేక ఇబ్బందులు పడుతున్న కొందరు పౌల్ట్రీ రైతులు ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని భారీగా తగ్గించినట్లు పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు.