విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:
అమరావతి, విశ్వం వాయిస్ః
ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలపై ఫిర్యాదు చేసేందుకు 104 కాల్ సెంటర్‌ను వినియోగించనున్నట్లు ప్రకటించారు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు. ఇందుకోసం 104ను బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం ఆయన సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవల మెరుగు, సమస్యలపై చర్చించారు. అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యం, అధిక డబ్బులు డిమాండ్ చేయడం, ఆరోగ్య శ్రీ సేవల్లో అలసత్వం, వాహనాలు అందుబాటులో లేకపోవడం వంటి వాటిపై 104కు ఫిర్యాదు చెయ్యొచ్చని కృష్ణబాబు చెప్పారు. బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనలకు సంబంధించిన నిజానిజాలను మీడియా ద్వారా తెలియజేస్తామన్నారు.‘‘ఫీవర్ సర్వేను కలెక్టర్లు తేలిగ్గా తీసుకోవద్దు. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, అరవయ్యేళ్లు పైబడిన వారికి ప్రికాషనరీ డోస్‌ను వేగవంతం చెయ్యాలి. జిల్లాల్లో క్యాడర్ వారీగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ప్రతినెలా శిక్షణ ఇవ్వాలి. శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి సమయానికి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.కొవిడ్ వల్ల మరణించిన వారికి పరిహారం చెల్లించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలి. జిల్లాల పునర్విభజన అనంతరం ఎన్‌హెచ్ఎం సిబ్బంది సర్దుబాటును సమీక్షించాలి. ఫైర్ సేఫ్టీ ఆడిట్‌కు సంబంధించి అన్ని ఆసుపత్రుల మాస్టర్ డేటా అప్లోడ్ కు చర్యలు తీసుకోవాలి. ఈనెల 30లోగా పోస్టుల్ని భర్తీ చేయాలన్న సిఎం ఆదేశాల్ని అమలుచేస్తాం’’ అని కృష్ణ బాబు అన్నారు. ప్రభుత్వాసుపత్రులకొచ్చే పేదలకు సేవలందించడంలో ఏమాత్రం అలసత్వం వహించొద్దని, ఆసుపత్రుల నుంచి పేదలు సంతోషంగా తిరిగి ఇంటికెళ్లాలన్నదే సిఎం జగన్మోహన్ రెడ్డి అభిమతమని ఆయన వ్యాఖ్యానించారు. కొవిడ్ కు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నింటినీ ఈనెల 25లోగా పంపించాలని కలెక్టర్లను క్రిష్ణబాబు ఆదేశించారు. మందుల కొనుగోలుకు రూ.650 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.