సమావేశం
– జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసీ, పీఎన్‌డీటీ) చట్టం పటిష్టంగా అమలయ్యేలా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కోర్టుహాల్‌లో లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994 అమలుపై జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ, సలహా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో చట్టం అమలు తీరుతెన్నులపై సమావేశంలో చర్చించారు. స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్, రెన్యువల్, డెకాయ్ ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు తదితరాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు వివరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2022, జనవరి నుంచి మార్చి వరకు 314 ఆకస్మిక తనిఖీలు, 55 డెకాయ్ ఆపరేషన్లు చేపట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా మాట్లాడుతూ జిల్లాలో స్థానిక డివిజన్ పరిధిలో 96 (ఆరు ప్రభుత్వ), పెద్దాపురం డివిజన్‌లో 27 (ఆరు ప్రభుత్వ) అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. డివిజన్ స్థాయి ప్రోగ్రామ్ అధికారులు, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం పరిధిలోని లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలతో పాటు లక్ష్యాల మేరకు డెకాయ్ ఆపరేషన్లు చేపట్టాలని ఆదేశించారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని స్పష్టం చేశారు. కొత్తగా స్కానింగ్ సెంటర్ల ఏర్పాటు, రెన్యువల్, చిరునామా మార్పులు/మెషీన్/ క్లోజర్ అనుమతులకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా అందుతున్న దరఖాస్తులను నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. 2021-22కు సంబంధించి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసీ, పీఎన్‌డీటీ) చట్టం అమల్లో రాష్ట్రంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రెండోస్థానం సాధించినందుకు కలెక్టర్.. అధికారులను అభినందించారు. అదే విధంగా కార్యక్రమంలో భాగంగా చట్టం పటిష్ట అమలుపై *ప్రకృతినే కాదు! పసిపాపని కూడా రక్షిద్దాం!! శీర్షికతో రూపొందించిన పోస్టర్‌ను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్‌పీ పి.శ్రీనివాస్, డీఎంహెచ్‌వో డా. ఎ.హనుమంతరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. పి.వెంకటబుద్ధ, డీఐవో కె.అంజిబాబు, అర్బన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ బి.శ్రీనివాసరావు, డెమో సీహెచ్ఎస్‌వీ ప్రసాదరాజు, ఉమా మనోవికాస కేంద్రం ప్రతినిధి ఎస్ఏ నాయుడు, సాస్ ప్రతినిధి వై.పద్మలత, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, వివిధ డివిజన్ల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.