అగ్ని ప్రమాదంలో మూడు తాటాకు ఇళ్లు దగ్ధం.
నిరాశ్రయులైన ఆరు కుటుంబాలవారు.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఈ గన్నవరం:
పి. గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్ )
మండలం లోని గంటి పెదపూడి గ్రామం అరిగేల వారి పేట వద్ద బుధవారం మూడు తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించడంతో తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే స్థానికులు కొత్తపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. దీంతో ఆ మూడు తాటాకు ఇళ్లలో నివాసముంటున్న ఆరు కుటుంబాల వారు రోడ్డు నిరాశ్రయులయ్యారు. ఈ మేరకు పి గన్నవరం ఎంపీడీవో కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. వారికి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అన్నా మినిస్ట్రీస్ సేవా సంస్థ వారు సమకూర్చిన బియ్యం, దుప్పట్లను అన్నా మినిస్ట్రీస్ అడ్మినిస్ట్రేటర్ ఎన్. రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ దంగేటి సత్యనారాయణ, ఎంపీటీసీ పల్లి మోషే బాధిత కుటుంబాల వారికి పంపిణీ చేశారు.