విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంకవరం:
శంఖవరం, మే 27, (విశ్వం వాయిస్ న్యూస్) :
ఆ కారు వేగానికి హద్దే లేకుండా పోయింది. ఆ కారును సాక్షాత్తూ ప్రాణాలను హరించే ఆ కాల యముడు యమధర్మ రాజే నడుపుతున్నాడా అనేంత వేగంతో దూసుకుపోతూ ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుని అంతే వేగంతో ఆ కారు గాలిలో పయనించినట్టు క్షణాల్లో మటుమాయం అయ్యింది. ప్రాణాలు గాల్లో కలసి పోయిన ఆ యువకుని మృత దేహం మాత్రం ఓ అనాధ శవంలా నడి రోడ్డు పాలైంది. ఓ నిండు కుటుంబంలో ఇంటి పెద్ద దిక్కును పొట్టన బెట్టుకున్న ఈ తీవ్ర తీరని విషాదం వెనుక వివరాలు ఇవి.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలం కత్తిపూడి – కాకినాడ బైపాస్ రోడ్డు మలుపు (వంపు) కూడలి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రౌతులపూడి మండలం శృంగవరం గ్రామ సచివాలయం వాలంటీర్, దళితుడు, ఇద్దరు బిడ్డల తండ్రి నడిపల్లి సుబ్రహ్మణ్యం (28) అందరిలానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం శంఖవరం మండలంలో చేపట్టిన ‘సామాజిక న్యాయ భేరి` బస్సు యాత్రలో అన్నవరంలో మొదలుకొని కత్తిపూడి వరకూ తన బైక్ పై జనప్రదర్శనలో పాల్గొన్నాడు. యాత్ర సజావుగా, క్షేమంగా, ప్రశాంతంగా ముగిసింది. అనంతరం సుబ్రహ్మణ్యం గొల్లప్రోలు వెళ్ళే క్రమంలో కత్తిపూడిలో బస్టండ్ సెంటరులో బయలు దేరి ఊరి చివరి బైపాస్ రోడ్డు మలుపు చేరుకున్నాడు. మలుపు దాటుతుండగా అన్నవరం వైపు నుంచి కాకినాడ వైపునకు వేగంగా వెళుతూ ఓ గుర్తు తెలియని కారు సుబ్రహ్మణ్యంను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో తనకేం జరుగుతోందే సుబ్రహ్మణ్యం గ్రహించే లోపే అతను గాల్లో అంతెత్తున లేచి జాతీయ రహదారిపై పడి శిరస్సుకు బలమైన గాయమై అక్కడికక్కడే ప్రాణాలు అనంత వాయువుల్లో కలసి పోయాయి. పోలీసులు , ప్రజలూ సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతుడు సుబ్రహ్మణ్యం మోటార్ సైకిలుకు కట్టిన వైఎస్సార్ పార్టీ జండాను బైకు నుంచి వేరు చేసిన విషయమై బంధువులు ఆందోళన చేపట్టారు. ఎంత అధికార పార్టీ ఐతే మాత్రం ప్రభుత్వ ఉద్యోగులను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనమని ఇంతలా వత్తిడి చేస్తారా అంటూ నిలదీసారు. ఈ బస్సు యాత్రకు మా వాడు బైక్ పై ర్యాలీకి రాకుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని బంధువులు తమ ఆవేదన వ్యక్తం చేసారు. ముందు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని అదుపులోకి తీసుకోవాలని, అంతవరకూ మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు తరలించొద్దనీ బంధువులు భీష్మంచుకు కూర్చున్నారు. అన్నవరం, ప్రత్తిపాడు పోలీసు ఎస్సైలు బంధువులను వప్పించే ప్రయత్నం చేస్తున్నారు.