విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ విశ్వం వాయిస్ న్యూస్
వ్యవసాయం,ఉపాధి,విద్య, వైద్యం తదితర రంగాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని.. సామాజికంగా,ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా లబ్ధిదారులకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లా నుంచి వర్చువల్ విధానంలో కేంద్ర ప్రాయోజిత పథకాలపై వివిధ రాష్ట్రాలకు చెందిన లబ్ధిదారులతో మాట్లాడారు.అనంతరం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద 11వ విడతగా రూ. 2000 చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కృతికా శుక్లా, జెడ్‌పీ ఛైర్‌పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు, వైస్ ఛైర్‌పర్సన్ బుర్రా అనుబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, రైతులు, వివిధ పథకాల లబ్ధిదారులు హాజరయ్యారు.కాకినాడ జిల్లాకు సంబంధించి 1,57,914 మంది రైతు కుటుంబాలకు రూ. 31.58 కోట్ల పీఎం కిసాన్ సాయం మెగా చెక్‌ను రైతులకు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి,గృహ నిర్మాణం,ఆరోగ్యం, ప్రజా పంపిణీ వ్యవస్థ, వ్యవసాయం, కుటుంబ సంక్షేమం తదితర విభాగాల్లో కేంద్ర ప్రాయోజిత పథకాల గురించి గౌరవ ప్రధానమంత్రి వివరించారని తెలిపారు.జిల్లాలో రైతుల సంక్షేమం లక్ష్యంగా జూన్ 1 నుంచి ఖరీఫ్ సాగుకు నీరు అందించనున్నట్లు వెల్లడించారు.ఈ అంశంపై రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీజన్‌ను విజయవంతంగా పూర్తిచేసేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.తాజాగా పీఎం కిసాన్ కింద అందిన సాయం ఖరీఫ్‌కు విత్తనాలు,ఎరువులు వంటి వాటిని కొనుగోలు చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ కృతికా శుక్లా స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీపీవో ఎస్‌వీ నాగేశ్వర్ నాయక్, వ్యవసాయ అధికారి స్వాతి, మెప్మా పీడీ బి.ప్రియంవద, హౌసింగ్ పీడీ బి.సుధాకర్ పట్నాయక్, డీఎంహెచ్‌వో డా. ఎ.హనుమంతరావు, వివిధ శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు,లబ్ధిదారులు హాజరయ్యారు.