అర్హులు
– సమగ్ర సమాచారం కోసం
( PMFME ) యాప్ నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్:
నాణ్యమైన ఆహార పదార్థాలను తయారు చేసిన సరైన మార్కెటింగ్ నైపుణ్యం లేని కారణంగా ప్రోత్సహం లభించడం లేదని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి- సూక్ష్మ ఆహార శుద్ది పరిశ్రమల క్రమబద్దికరణ పథకం పై సమన్వయ శాఖల, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల మహిళలు చేసే ఆహార పదార్థాలకు ఒక బ్రాండ్ ఏర్పాటు చేసి మార్కెటింగ్ చేయాలన్నారు. పరిశుభ్రతతో కూడిన వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చెయ్యడం, ప్యాకింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని ఆకర్షణీయంగా కనబడేలా చూడాలన్నారు. ప్రధానమంత్రి- సూక్ష్మ ఆహార శుద్ది పరిశ్రమల క్రమబద్దికరణ పథకం లో భాగంగా సంప్రదించే జిల్లా రిసోర్స్ పర్సన్ వివరాలు ప్రజలకు తెలియచేయాల్సి ఉందన్నారు. పది శాతం పెట్టుబడితో సూక్ష్మ ఆహార శుద్ది పరిశ్రమ ను రూ.10 లక్షలు తో ఏర్పాటు చేస్తే పెట్టుబడి పెట్టే రూ.9 లక్షల రుణ సదుపాయం లో రూ.3.50 లక్షలు సబ్సిడిగా తిరిగి పొందవచ్చునని తెలిపారు. తీసుకున్న ఋణం లో రూ.5.50 లక్షలు తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. తీసుకున్న రుణ లను సక్రమంగా తిరిగి చెల్లించి మరింత ప్రయోజనం కలుగుతుందని శ్రీధర్ పేర్కొన్నారు. అర్హత ఉన్న పరిశ్రమలు గా అప్పడాలు, పచ్చళ్ళు , కారం, తినే పాల పదార్థాలు, పళ్ళ రసాలు, జామ్, సాసు మొదలగునవి ఈ కేటగిరీలో మార్కెటింగ్ కి అవకాసం ఉందన్నారు. డి మార్ట్, రిలయన్స్ తరహా సూపర్ మార్కెటింగ్ మాల్ తో ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ (Food Safety and Standards Authority of India) నిబంధనలు మేరకు ధృవీకరించబడిన ఆహార పదార్థాలు అమ్మకాలు జరిగే అవకాశం ఉందని, ఆ దిశలో ఆలోచన చేయాలన్నారు. సంఘటితంగాఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.
ఆహా ఏమీ రుచి :
గవ్వలు, పుతరేకు లను రుచి చూసిన జేసీ మహిళలను అభినందించారు. వర్క్ షాప్ సందర్భంగా ఆత్రేయపురం పూతరేకులు – పచ్చళ్ళు, , పెరవలి బిస్కెట్స్, స్వీట్స్, నల్లజర్ల పచ్చళ్ళు లను ప్రదర్శనలో ఉంచారు. వాటి రుచి చూసి మహిళల్ని అభినందించిన జేసీ ఫైవ్ స్టార్ హోటల్, మాల్స్ లలో దొరికే వాటికి దీటుగా వీటి రుచులు ఉన్నాయని, ఆకర్షణీయంగా ప్యాకింగ్, బ్రాండ్ పేరు పెట్టి అమ్మాలని జేసీ సూచించారు. ఆహార పరిశ్రమ లో ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ నిబంధనల పట్ల అవగాహన కలిగించి లైసెన్స్ వచ్చేలా మార్గదర్శకం చెయ్యడం జరుగుతుందని తెలిపారు. మార్కెటింగ్ సంబంధించి సూచనలు, సలహాలు విషయంలో గ్రూపు లకు బ్రాండింగ్, లిస్టింగ్, ప్రమోషన్ కూడా చేదోడువాదోడుగా నిలవడం జరుగుతుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడం లో ఎలాగో తెలియక పోవచ్చు, అందుకోసం రిసోర్స్ పర్సన్లుగా రాజమండ్రి లో అమీలా (9254851972) కొవ్వూరు ఎమ్. రాజా కిషోర్ (8074348855) లు సూచనలు చెయ్యడం జరుగుతుందన్నారు. జిల్లాలో సమన్వయ కర్త గా జిల్లా హార్టికల్చర్ అధికారి వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.
సూక్ష్మ ఆహార శుద్ది పరిశ్రమలు అసంఘటిత రంగంలో ఉన్న వారిని ప్రోత్సహించి తీసుకుని రావడం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే త్రాటి లోకి రావడం ఇదే మొదటిసారని పిఎమ్ఎఫ్ఎమ్ఈ మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ మారుతి పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల ప్రణాళికతో ఈ పథకం తీసుకుని రావడం జరుగుతోంది. పారిశ్రామిక పరంగా ఎలా సంస్థాగతం చేసి స్థిరమైన ఆదాయ వనరులు పెంచేందుకు సాంకేతిక నిపుణత కోసం శిక్షణా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయిలో శిక్షకుల ద్వారా పరిశ్రమ నిర్వహణ, అభివృద్ధి కి కావలసిన సూక్ష్మ తరహా ఆహార పరిశ్రమలకు ప్రభుత్వ గుర్తింపు వచ్చేలా జిల్లా, రెవెన్యూ ,మండల పరిధిలో వర్కుషాప్ ద్వారా దిశా నిర్దేశం చేస్తుంటామన్నారు. మూలధన పెట్టుబడి విషయంలో కూడా సహకారాన్ని అందిస్తాము, ఇందుకోసం పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు జరుపవలసి ఉంది. జిల్లా రిసోర్స్ పర్సన్ పూర్తి సహకారాన్ని అందిస్తారని, పిఎం ఎఫ్ ఎం ఈ యాప్ ద్వారా కూడా సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు నని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పిడి డిఆర్డిఏ ఎం. డేగలయ్యా, డిపివో జే. సత్యనారాయణ, ఎల్ డి ఏమ్ శ్రీనివాస్ రావు, సెర్ప్ అడిషనల్ డెరైక్టర్ సుధాకర్, రిసోర్స్ పర్సన్ లు, ఇతర శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాలు మహిళలు, ఔ త్సహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.