సమావేశంలో వెల్లడి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్)
రావులపాలెం మండలంలోని వివిధ గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి మంచి నీటి బోర్లు వేసేందుకు ఒకొక్క ఎంపీటీసీ సభ్యుని పరిధిలో రూ. లక్ష చొప్పున రూ.24 లక్షలు 15వ ఆర్థిక సంఘం నిధులను కేటాయించినట్లు ఎంపీపీ కర్రి లక్ష్మి వెంకట నాగదేవి తెలిపారు. గురువారం రావులపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల పరిధిలో అమలు జరుగుతున్న పథకాలను, చేపట్టిన పనులను వివరించారు. తహశీల్దార్ వి.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం ద్వారా 120 ఎకరాల్లో 6000 మందికి ఇళ్ళ స్థలాల పట్టాలు పంపిణీ చేసామన్నారు. వెదిరేశ్వరం, ఈతకోట, దేవరపల్లి గ్రామాల్లో కొమరాజులంక మినహాయించి మిగిలిన 11 గ్రామాల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. 40 ఎకరాల్లో లెవెలింగ్ పూర్తి చేసామని చెప్పారు. ఈతకోట, వెదిరేశ్వరం గ్రామాల లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణం ప్రారంభమైందని, అయితే దేవరపల్లి లే అవుట్లో ఇళ్ళ నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదన్నారు. దీనివల్ల ప్రభుత్వం నుంచి వచ్చే రూ.1.80 లక్షల రుణం రద్దయ్యే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కోరారు. గోపాలపురం ఇరిగేషన్ ఏఈ సుందర్ సింగ్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ తీగలకు అడ్డువచ్చే చెట్ల కొమ్మలు నరికి కాలువల్లో పడేస్తున్నారని దీని వల్ల కాలువల్లో నీరు సక్రమంగా పారక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అలాగే గ్రామాల్లో కూడా ప్రజలు చెత్తను కూడా కాలువల్లో పడేస్తున్నారని, సర్పంచులు దీనిని దృష్టిలో పెట్టుకొని చెత్త కాలువల్లో వేయకుండా శ్రద్ద తీసుకోవాలని కోరారు. ముక్తేశ్వరం, అమలాపురం, గన్నవరం ప్రధాన పంట కాలువలతో పాటు మొత్తం 24 కాలువలు ఉన్నాయని అన్ని కాలువల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. అలాగే ఇరిగేషన్ స్థలాల్లో తాత్కాలిక నిర్మాణాలని ప్రజా ప్రతినిధులకు చెప్పి, శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారని వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రజా ప్రతినిధులు తమకు సహకరించాలని కోరారు.
వైస్ ఎంపీపీ గన్నవరపు వెంకటరావు మాట్లాడుతూ దేవరపల్లి గ్రామంలో లో ఓల్టేజ్ సమస్య పరిష్కారానికి ఏడాదిన్నర క్రితమే నాలుగు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు చేసినా ఇంతవరకు ఏర్పాటు చేయలేదన్నారు. లక్ష్మి పోలవరంలో తెచ్చిన ట్రాన్స్ ఫార్మర్ ను తీసుకపోయారని సర్పంచ్ హనుమంతువఝుల హేమలత అన్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ఏఈ తెలిపారు. తమ గ్రామంలో కొన్ని డ్వాక్రా సంఘాల మహిళలు తాము తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించినా కొద్ది నెలలుగా కొత్త రుణాలు మంజూరు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీటీసీ పమ్మి శాంత కుమారి ఆరోపించారు. ఈ విషయాన్ని గత మూడు సమావేశాల్లో ప్రస్తావనకు తెచ్చినా సమస్య పరిష్కారం చేయలేదన్నారు. వ్యక్తిగత కక్షతో రుణాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై వారం రోజుల్లో విచారణ చేసి అర్హులైన వారికి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎంపీపీ చెప్పారు. జెడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ రావులపాలెం మండలానికి జిల్లా పరిషత్ నుంచి రూ.23 లక్షలు వివిధ అభివృద్ది పనుల నిమిత్తం మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీలు గన్నవరపు వెంకటరావు, బొక్కా ప్రసాద్, ఎంపీడీవో జి.రాజేంద్రప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు…