– ఓఎఫ్ఐ కంపెనీ ప్రతినిధులు వివేక్ , నాగేశ్వరరావు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:
ఓలం ఫుడ్ ఇన్ గ్రీడియంట్స్ ఇండియా ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆదివారం గన్నవరం , గౌరీదేవిపేట , నందిగామ గ్రామాల్లోని రైతులు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు వివేక్ , నాగేశ్వరరావు పాల్గొని మొక్కలు నాటి రైతులకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం గౌరీదేవిపేట నుండి నందిగామ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వారిరువురు మాట్లాడుతూ మానవుని యాంత్రిక జీవనంలో కొంత సమయాన్ని కేటాయించి ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. ఐక్యరాజ్యసమితి యూఎన్ఓ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం జూన్ 5వ తేదీ 1972న ఆమోదించబడిందని తెలియజేశారు. నాటి నుండి ప్రతీ సంవత్సరం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వాతావరణం పూర్తిగా కలుషితంగా మారి పోయిందని , గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటితే అవి ఏపుగా పెరిగి సకాలంలో వర్షాలు కురుస్తాయని , రైతులు పాడి పంటలతో కళకళలాడుతూ ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారని వారు సూచించారు. నేడు ప్లాస్టిక్ వంటి వ్యర్థ పదార్థాల వల్ల కాలుష్య కోరల్లో చిక్కుకున్నామని , భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం ఇవ్వాలంటే తప్పనిసరిగా మొక్కలు నాటాలని పేర్కొన్నారు. చెట్లు మన భవిష్యత్ ఆక్సిజన్ నిధి అని అన్నారు. మొక్కలను ప్రేమించాలని , ఆరాధించాలని తెలిపారు. భారతదేశ ప్రాచీన సంస్కృతిలో మొక్కలను పూజిస్తారని , ప్రకృతి పర్యవేక్షణలో మొక్కల పాత్ర వుందని కాలుష్య నివారణకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు ఆకుల.వెంకటరామారావు (పెద్దోడు) , పసుపులేటి లక్ష్మణరావు , కానూరి బుల్లయ్య , బోల్లా పుల్లయ్య , దారా రవి , దయాకర్ తదితరులు పాల్గొన్నారు.