– లీడ్ బ్యాంకు- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఆధ్వర్యంలో రుణ వితరణ మహోత్సవం
– ఎంపీ వంగా గీత, కలెక్టర్ కృతిక శుక్లా
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్
సమాజ అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమైందని.. పేదల అభ్యున్నతి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విజయవంతంగా అమలుచేసేందుకు బ్యాంకింగ్ వ్యవస్థ ఎంతగానో తోడ్పడుతోందని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వీక్ (జూన్ 6-12) వేడుకల్లో భాగంగా కేంద్ర ఆర్థిక సేవల డిపార్ట్‌మెంట్, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి మార్గనిర్దేశాలకు అనుగుణంగా బుధవారం స్థానిక నాగమల్లితోట జంక్షన్‌వద్ద ద్వారంపూడి భాస్కరరెడ్డి, పద్మావతి కళ్యాణమండపంలో లీడ్ బ్యాంక్-యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రుణ వితరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ఓ వ్యక్తి పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదిగేలా చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకుల సహాయంతో వివిధ కార్యక్రమాలు అమలుచేస్తున్నాయని.. యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకు రుణాల ద్వారా ఏర్పాటుచేసిన యూనిట్లను జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా, ముందుచూపుతో అభివృద్ధి పథంలో పయనించేలా చూసుకోవాలన్నారు. ఉత్పత్తి చేస్తున్న వస్తువుల డిమాండ్, మార్కెటింగ్ అవకాశాలపై ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ, మెరుగైన ప్రణాళికల ద్వారా అభివృద్ధి సాధించాలన్నారు. ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు బ్యాంకుల సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని.. వ్యవసాయ, విద్యా రుణాలపై మరింత దృష్టిసారించాలని ఈ సందర్భంగా బ్యాంకర్లకు సూచించారు. విద్యా రుణాల వితరణకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఎంపీ కోరారు.
*డీబీటీ పథకాల అమల్లో బ్యాంకుల పాత్ర కీలకం: జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా*
జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఐకానిక్ వీక్ వేడుకల వరకు పూర్వ తూర్పుగోదావరి జిల్లాలో రిటైల్ అడ్వాన్సులు, వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఈల కేటగిరీల్లో మొత్తం 44,369 మంది లబ్ధిదారులకు రూ.1,587 కోట్ల మేర బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయని.. వీటిలో ఇప్పటికే కొన్ని రుణాల పంపిణీ పూర్తికాగా.. మిగిలినవాటి పంపిణీ ఈ నెల 30 నాటికి పూర్తవుతుందని వివరించారు. ఒక్క రుణాలే కాకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు విజయవంతం కావడంలో బ్యాంకుల సేవలు కీలకంగా మారాయని పేర్కొన్నారు. కేలండర్ ప్రకారం ప్రభుత్వం పథకాలు అమలుచేస్తున్నందున పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేసే రోజుకు రెండు రోజుల ముందు నుంచి అయిదు రోజుల పాటు బ్యాంకుల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేయాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. దీనివల్ల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పరిష్కరించి, పథకం ఫలాలు పూర్తిస్థాయిలో అందించేందుకు వీలవుతుందన్నారు. డిజిటల్ లావాదేవీలు-భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్యాంకులు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు వ్యాపారంలో రాణించాలని సూచించారు. రుణాలను నిర్దేశ గడువులోగా తిరిగి చెల్లించి.. మళ్లీమళ్లీ రుణాలు పొందుతూ వ్యాపారాలను అభివృద్ధి పరచుకోవాలన్నారు. కోవిడ్ సమయంలో ఆసుపత్రులతో పాటు బ్యాంకులు కూడా అవిశ్రాంతంగా సేవలందించాయని.. ఈ సేవలు మరువలేనివని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
లీడ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్; డీసీసీ, డీఎల్ఆర్‌సీ కన్వీనర్ కేఎన్‌వీ చిన్నారావు మాట్లాడుతూ స్టాండప్ ఇండియా, ముద్రా, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ, పీఎం స్వానిధి, జగనన్న తోడు తదితర కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, అవసరమైన వారికి రుణాలు మంజూరు చేసేలా చూడటం ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. పీఎంఎస్‌బీవై, పీఎంజేజేబీవై తదితరాలపై అవగాహన కల్పించి నమోదయ్యేలా చేసేందుకు, భద్రతమైన డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వివరించారు.
ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ స్టాండప్ ఇండియా, ముద్రా, పీఎంఈజీపీ వంటి కార్యక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించి, సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వారు ఏర్పాటుచేసిన వ్యాపారాల స్టాళ్లను ఎంపీ, కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించారు. రుణ వితరణ మహోత్సవం సందర్భంగా వివిధ బ్యాంకులు మంజూరుచేసిన రుణాల మెగా చెక్‌లను లబ్ధిదారులకు అందజేశారు. అదే విధంగా రుణాల మంజూరులో ప్రగతి కనబరచిన బ్యాంకు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు.ఈ కార్యక్రమంలో లీడ్ జిల్లా మేనేజర్ (ఎల్‌డీఎం) ఎస్.శ్రీనివాసరావు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఐఎస్ఎన్ మూర్తి, ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ జె.నరసింహమూర్తి, నాబార్డు డీడీఎం వై.సోమినాయుడు, డీఐసీ జీఎం మురళి, మెప్మా పీడీ బి.ప్రియంవద తదితరులతో పాటు వివిధ బ్యాంకుల అధికారులు, లబ్ధిదారులు హాజరయ్యారు.