విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
రాజానగరం : విశ్వం వాయిస్ న్యూస్
ద్రవ రూపంలో గంజాయిని రవాణా చేస్తున్న ముఠాను రాజానగరం పోలీసులు గురువారం పట్టుకున్నారు. వారి నుంచి ద్రవరూపంలో ఉన్న 10 కిలోల గంజాయి టిన్నులను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులు రెండు బైకులపై 5 లీటర్ల వాటర్ టిన్నులను వేసుకుని ఏజెన్సీ ప్రాంతం చింతపల్లి నుంచి రాజమహేంద్రవరానికి పయనమయ్యారు. ముందుగా అందిన సమాచారం మేరకు స్థానిక సీఐ ఎంవీ సుభాష్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై గైట్ కళాశాలకు ఎదురుగా ఉన్న బ్రిడ్జికౌంటీ వద్ద వాహనాలను సోదా చేస్తుండగా వీరు చిక్కారు. ఆ రెండు బైకులను ఆపి, టిన్నుల గురించి ప్రశ్నించగా ‘వాటర్’ అని బుకాయించి, తప్పించుకునే ప్రయత్నం చేశారు. మూతలు తీసి, చెక్ చేస్తే వాటిలో గంజాయి ద్రవ రూపంలో ఉండటాన్ని గుర్తించారు. దీని విలువ సుమారు రూ.లక్షన్నర వరకు ఉంటుందని అంచనా. కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.