– 5 గ్రామపంచాయతీల తీర్మానం
– వరదల్లో ప్రభుత్వ పనితీరు బాగుంది
– ప్రెస్ మీట్ లో ప్రజాప్రతినిధులు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:
తెలంగాణా మాకొద్దు ఆంధ్రాలోనే తాముంటామని మండలంలోని పురుషోత్తపట్నం గ్రామంలో శుక్రవారం ప్రజాప్రతినిధులు , ఎంపిటిసిలు , సర్పంచులు , గ్రామస్తులు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పురుషోత్తపట్నం సర్పంచ్ బుద్దా ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కన్నాయిగూడెం ఎంపిటిసి వర్స బాలకృష్ణ , గుండాల ఎంపిటిసి గొంగడి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఐదు పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని కొంతమంది స్వార్ధ ప్రయోజనాల కోసం తప్పుడు తీర్మానాలు సృష్టించి ఐదు పంచాయతీల ప్రజల మనోభావాలను అర్ధం చేసుకోకుండా తెలుగు రాష్ట్రాల్లో అలజడి సృష్టిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. తమ అక్రమ వ్యాపారాలు కొనసాగించేందుకు , ఉద్దేశపూర్వకంగానే అల్లర్లు సృష్టిస్తున్నారన్నారు. గోదావరి వరదలకు ఐదు పంచాయతీల ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికార ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుందన్నారు. ఆంధ్రా సరిహద్దులో వున్న వారి అక్రమ ఆస్తులు కాపాడుకునేందుకు ఇటువంటి బురద జల్లే ప్రచారం చేస్తున్నారన్నారు. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ఏదిఏమైనా తామంతా ఆంధ్రాలోనే కొనసాగుతామని వారు తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు , ఎంపిటిసిలు , సర్పంచులు , వైసీపి రాష్ట్ర నాయకులు మంత్రిప్రగడ నరసింహరావు , వైసీపి జిల్లా నాయకులు కురినాల వెంకట్ (బుజ్జి) , వైసీపి సీనియర్ మహిళా నాయకురాలు దామెర్ల రేవతి , రంభాల నాగేశ్వరరావు , జయచంద్రారెడ్డి , కుందూరు రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.