విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:
జిల్లా అధ్యక్షులను మార్చేందుకు వై సి పి కసరత్తు
– వర్గ పోరు ఎక్కువయ్యే చాన్స్
– వచ్చే ఎన్నికలలో పార్టీకి తీరని నష్టం ?
– విబేధాల సమసి పోయేందుకు మరింత కృషి జరగాలంటున్న పార్టీ క్యాడర్
– అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యతకు డిమాండ్
కాకినాడ, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్: రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు వచ్చేందుకు ఇంకా రెండు సంవత్సరాలే సమయం వుంది. జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చునన్న ఊహాగానాలు కూడా ఈ మధ్య జోరందుకున్నాయి. జనసేన, తెలుగుదేశం పార్టీలు తమ పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల పొత్తులపై కసరత్తు కూడా ప్రారంభించేసాయి. మొత్తం మీద 2024 లో అధికారమే లక్ష్యంగా వివిధ ప్రధాన పార్టీలు తమ వంతు ప్రయత్నాలను జోరందుకునేలా చేసాయన్నది విస్పష్టం.
వై ఎస్ ఆర్ సి పి కూడా 2024 ఎన్నికలకు తన కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ లో జిల్లా కోఆర్డినేటర్లను నియమించింది. వివిధ నియోజక వర్గాలలో పార్టీ బాధ్యతలు వివిధ మంత్రులకు అప్పగించింది. తర్వాత దాదాపుగా అన్ని జిల్లాల అధ్యక్షులను మార్చనున్నదని పొలిటికల్ వర్గాలలో వార్తలు ఊపందుకున్నాయి. ఈ మార్పు వ్యవహారంలో తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు ఆశావహులు అప్పుడే అమరావతిలో లాబీయింగ్ ప్రారంభించారని విశ్వసనీయ సమాచారం. ఏ పార్టీలోనైనా వర్గ పోరు అనేది సహజం.పదవులు దక్కిన వర్గానికి వ్యతిరేకంగా పదవులు దక్కని వర్గం గ్రూప్ కట్టి పార్టీ పెద్దల ముందు వారి వైఫల్యాలను ఎండగట్టే ప్రక్రియ మన దేశంలో ప్రజాస్వామ్యం అంత పాతది. కొన్ని మండలాలు లేక జిల్లాలలో అయితే మూడు , నాలుగు గ్రూపులు కదా ఏర్పడి పార్టీ పెద్ద కు తలనొప్పులు తెస్తున్నారు. ఎన్నికల ముందు ఈ గ్రూపుల వ్యవహారం మరింత ముదురుతుంటుంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ, రీజనల్ కోఆర్డినేటర్ ల నియామకం తర్వాత అధికార వై సి పి లో గ్రూపు తగాదాలు, రెండు వర్గాల మధ్య బాహాబాహీలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని వర్గాలు పార్టీ అధ్యక్షుడి విజ్ఞప్తులకు వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శించుకుంటూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. పిట్టల తగువు పిల్లి తీర్చిందన్న చందన ఈ గొడవలు విపక్షాలకు అటు వినోదం ఇటు అధికార పార్టీని విమర్శించేందుకు ఒక ఆయుధంగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపధ్యంలో వివిధ జిల్లాల అధ్యక్షుల మార్పు అనేది వై ఎస్ ఆర్ సి పి కి ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది.ఇప్పటికే పెరుగుతున్న గ్రూపు రాజకీయాలు, తగాదాలు ఇందుమూలంగా మరింత బలపడి పార్టీకి డామేజ్ చేసే అవకాశాలు ఎక్కువ. కాబట్టి అధికార పార్టీ ముందుగా ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి ముందుగా గ్రామ స్థాయి నుండి పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చెయ్యాలి. మండలాల వారీగా వివిధ నాయకులను కోర్చోబెట్టి వారి మధ్య విబేధాలు సమసిపోయేలా సర్ధుబాటు చేయాలి. గతంలో రాష్ట్ర చరిత్రలో వర్గపోరులు ప్రభుత్వాల ప్రతిష్టను దెబ్బతిసి, సార్వత్రిక ఎన్నికలలో కోలుకోలేని దెబ్బ తీసాయో జగద్విదితమే. వాటి ద్వారా పాఠాలు నేర్చుకొని తమ ఎన్నికల వ్యూహాలను పఠిష్టపరచుకోవడం అధికార పార్టీకి ఎంతో హితం చేస్తుంది.