విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్నం:
మాతా శిశు సంక్షేమ పధకం అవహేళన
-పౌష్టికాహారం పేరిట కుళ్ళిపోయిన గుడ్ల సరఫరా
-వారంలో రెండవసారి ఘటన పునరావృతం
– అధికారుల పర్యవేక్షణ లోపమే కారణం ?
– బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:
పౌష్టికాహార లోపం కారణంగా ఏటా లక్షల సంఖ్యలో గర్భిణులు, చిన్న పిల్లలు అకాల మృత్యువు వాత పడడమో లేక తీవ్ర అనారోగ్యం పాలిట పడడమో జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాతా శిశు సంక్షేమ పధకం పేరిట అంగన్వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహారం అందించే పధకం అమలు చేస్తోంది. ఈ పధకానికి రాష్ట్రంలో రెండు వేల కోట్లు ఖర్చవుతున్నట్లు సమాచారం. అయితే ఈ పధకం అమలులో ఉన్నతాధికారుల పరంగా నిఘా, నియంత్రణ లేకపోవడం వలన కాంట్రాక్టర్ చేతి వాటం కనబరుస్తూ సరఫరా చేసే ఆహార పదార్ధాలలో నాణ్యతకు త్రిలోదకాలిస్తున్నారు. క్రితం ఆదివారం రామచంద్రాపురం అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిపోయిన గుడ్లు, వాసన వచ్చే పాలు సరఫరా చేసిన ఘటన స్థానికులు మరవకముందే తాజాగా సోమవారం నాడు రాయవరం మండలం లో ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రంలో తిరిగి కుళ్ళిపోయిన కోడిగుడ్లు సరఫరా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే సదరు అంగన్వాడీ కేంద్రంలో సోమవారం ఉదయం 8 గంటలకు సరఫరా అయిన కోడిగుడ్డు గులాబీ రంగులో వుండి వాటి నుండి తీవ్రమైన దుర్వాసన వచ్చింది.కొన్ని కోడి గుడ్లు పగులగొడితే అవి కుళ్ళిపోయి వుండడమే కాకుండా వాటిలో పురుగులు కూడా వున్నాయి. వెంటనే అంగన్వాడీ టీచర్ స్పందించి గ్రామ సర్పంచ్ మరియు ఇతర అధికారులకు సమాచారం అందించారు. గ్రామ సర్పంచ్ రామకృష్ణ ఇతరులతో కలిసి కోడిగుడ్లను తనిఖీ చేయగా అవి పశువులు తినడానికి కూడా పనికి రావని నిర్ధారించారు. ఈ కేంద్రాలకు రెగులర్ గా గుడ్లు సరఫరా చేసే కంట్రాక్టర్ భారీగా అవినీతికి పాల్పడి, కుళ్లిపోయిన గుడ్లను సరఫరా చేసినట్లు సమాచారం. వీటిని తింటే తీవ్రమైన అనారోగ్యాల పాలిట పడడం ఖాయం. వచ్చిన వెంటనే కోడిగుడ్లను లబ్దిదారులకు పంచి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తమ కేంద్రాలలో అవి నిల్వ వుండే అవకాశమే లేదని టీచర్ తెలియజేస్తున్నారు. కంట్రాక్టర్ గుడ్ల సరఫరా చేసే ముందు మండల అధికారుల పరిధిలో తనిఖీలు చేపట్టి ఉంటే కాంట్రాక్టర్లు ఈ విధంగా చేతివాటం ప్రదర్శించే సాహసం చెయ్యరని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతవారం ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు తీసుకొని వుంటే కాంట్రాక్టర్లు మళ్ళీ మళ్ళీ ఇటువంటి అవకతవకలకు పాల్పడేవారు కాదని, కాబట్టి ఇకనైనా పౌష్టికాహారం పేరిట ఇటువంటి కుళ్ళిపోయిన గుడ్లను సరఫరా చేసి బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లల జీవితాలతో ఆటలాడుకోవడం దారుణమని, వెంటనే సదరు కంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పధకాల ఏ విధంగా అమలవుతున్నాయో తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు తరచుగా తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.