– రైతుల ముసుగులో రాజకీయ ర్యాలీలు మానుకోవాలని
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
రాజధాని అమరావతి పేరిట తెలుగుదేశం పార్టీ రియల్ ఎస్టేట్ దందా చేసిందని రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడాల ప్రసాద్ మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తో సమానంగా మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేయకపోవడం వల్లే హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర విభజనకు బీజాలు పడ్డాయని చెప్పిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన అనంతరం నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టి అదే తప్పిదానికి పూనుకున్నాడని దుయ్యబట్టారు.అటువంటి తప్పిదం జగన్మోహన్ రెడ్డి నేతత్వంలోని వైసీపీ ప్రభుత్వం చేయదని భవిష్యత్తులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య హెచ్చుతగ్గులు, బేధాభిప్రాయాలు రాకూడదనే ముందు చూపుతోనే సీఎం వై.యస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారని తెలిపారు.ఇదే విషయమై రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు, వై.సి.పి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని
భరత్ రామ్ మంజీర హోటల్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన మేధావులు ఏకాభిప్రాయంతో మూడు రాజధానులకు మద్దతు వెలిబుచ్చారని అన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, వారిని ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న వారి రియల్ ఎస్టేట్ దందాలో లబ్ధి చేకూర్చడం కోసమే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎన్నుకొని రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించారు కాబట్టే నేడు మూడు రాజధానులకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు చేస్తూ మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఇకనైనా తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని రైతుల ముసుగులో రాజకీయ ర్యాలీలు మానుకోవాలని,తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని దిమా వ్యక్తం చేశారు.