విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
పవన్ కు కొత్త తలనొప్పులు
– టి డి పి తో దోస్తీ పై రెండుగా చీలిన పార్టీ
– స్వంతంగా బలపడితే మంచిదన్న అభిప్రాయం
– ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదంటున్న మరొక వర్గం
– రెండు వర్గాల సమన్వయం అధినేతకు కత్తి మీద సామే
అమరావతి, విశ్వం వాయిస్ పొలిటికల్ న్యూస్ సి.హెచ్.ప్రతాప్:
ఆంధ్ర ప్రదేశ్ లో జనసేనకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు తమ అధినేత పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానిని మరి ప్రశ్నించకుండా ఆమోదించే జన సైనికులు ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయారని పొలిటికల్ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం ఘటన తర్వాత విజయవాడలో టి డి పి అధినేత చంద్రబాబు నాయుడు తో జనసేన అధినేత పవన్ భేటీ తరువాత పార్టీలో చాలా మంది ఈ భేటీపై పెదవి విరుస్తోన్నట్లు సమాచారం. తమను సంప్రదించకుండానే తమ అధినేత బి జె పి తో ప్రస్తుతం వున్న పొత్తుపై వ్యతిరేకంగా మాట్లాడి, టి డి పి తో పొత్తుకు అంగీకరించడం ఇప్పుడు పార్టీలో చీలిక తెచ్చే ప్రమాదం వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టి డి పి – జనసేన స్నేహాన్ని అంగికరించిన వాళ్లు ఒక వర్గం మరో వైపు బాబుతో పొత్తులను వ్యతిరేకించిన వాళ్లు ఒక వర్గంగా చేరి సొంత పార్టీలోనే గొడవలు పడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఇంటర్నల్ గా ఉన్న వాటప్స్ గ్రూపులలో ఈ గొడవలు తారాస్థాయికి చేరుతున్నట్లు, అంతేకాకుండా పార్టీ అంతర్గత సమావేశంలో ఈ అంశంపై వాడిగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయినప్పటికి చంద్రబాబుకు మద్దతుగా నిలిచింది. తరువాత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జనసైనకులకు టీడీపీ రాజకీయంగా సరైన స్థానం కల్పించకపోవడంతో అసంతృప్తి రగులుకుంటూ వచ్చింది. నాటి నుండే పార్టీ కాడర్లో విభేదాలు మొదలైయ్యాయి. 2019 ఎన్నికలలో బి జె పి తో జన సేన పొత్తు పెట్టుకుంది. ఈ ఎన్నికలలో జనసేన గణనీయమైన విజయం సాధించనప్పటికీ పార్టీ కాడర్ తమ పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజలలోకి తీసుకు వెళ్ళగలిగింది. తర్వాత పవన్ ఎన్నికల ఓటమిని ధైర్యంగా అంగీకరించి, పార్టీ బలోపేతం దిశగా తమ దృష్టి పెట్టారు. ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలను ధైర్యంగా ప్రశ్నిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇకపై తన మద్దతు జనసేనకు వుంటుందని బలమైన సంకేతాలు ఇవ్వడంతో పార్టీ మరింత పటిష్టమైనట్లు జనసైనికులు భావిస్తున్నారు. ఇటువంటి అనుకూల పరిస్థితులలో
ఇప్పుడు మళ్లీ బాబుతో పవన్ కలిస్తే పార్టీ నష్టం తప్ప లాభం లేదని వాదిస్తున్నారు కొందరు. పార్టీ సొంతంగానే ఎన్నికల బరిలో దిగితేనే వచ్చే ఎన్నికల్లో పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయంటున్నారు పార్టీలో ఒక వర్గం నేతలు. ఈ వర్గం వాదనలను వ్యతిరేకిస్తూ, జనసేన టి డి పి తో పొత్తు పెట్టుకోవడం మంచిదని, రెండు పక్షాలకు కలిపి 42 శాతం దాకా ఖచ్చితమైన ఓట్ బ్యాంక్ వుందని, ఈ వోట్లను 100 శాతం తమకు అనుకూలంగా మలచుకోగలిగితే ఎన్నికలలో విజయం తధ్యం అని ఇంకొక వర్గం బలంగా వాదిస్తోంది.
2014 ఎన్నికల్లో మాదిరిగానే వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ ఓటు బ్యాంక్ ను టీడీపీ వాడుకుని వదిస్తోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరికొందరు. టి డి పి తో పొత్తు పెట్టుకుంటే తమకు 30 సీట్ల కంటే ఎక్కువ లభించడం కష్టమని, స్వంతంగా లేదా బి జె పి తో కలిసి పోటీ చేస్తే ఎక్కువ సీట్ల కేటాయింపు తమకే జరుగుతుంది కాబట్టి తమకు అనుకూల పరిస్థితులు వుంటాయని ఒక వర్గం బలంగా వాదిస్తోంది. టి డి పి చరిత్ర చూస్తే ఎప్పుడు యూజ్ అండ్ త్రో(వాడుకొని వదిలేసే తత్వం) కాబట్టి ఇప్పుడు కూడా తమ బలంతో గెలిచి ఆనక తమను పక్కన పెట్టేసే ప్రమాదం వుందని, అంతకంటే స్వంతంగా బలపడుతూ , టి డి పి, వై సి పి లకు ప్రత్యామ్నాయంగా ఎగగడమే మంచిదన్న అభిప్రాయం ఒక వర్గంలో వుంది. ఇదిలా ఉంటే ఇప్పుడిప్పుడే జనసేనకి ప్రజల్లో మంచి గుర్తింపు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బాబుతో చేరితే బాబు పై ఉన్న వ్యతిరేకతను మూటకట్టుకోవడం తప్ప ఇప్పుడు పార్టీకి వచ్చే లాభం లేదంటున్నారు పార్టీ కొందరు కీలక నేతలు. మరో వైపు 2014 ఎన్నికల నాటి పరిస్థితులు వేరని ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద జనసేనలో టి డి పి తో పొత్తుపై రెండు వర్గాలుగా విడిపోయిందని సమాచారం. ఈ రెండు వర్గాలను సమన్వయం చేసుకూంటూ ముందుకెళ్ళడం పవన్ కు కత్తి మీద సాము వంటిదని పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు.