విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
కంచికామకోటి పీఠాధిపతి ఆగమనంతో రాజమహేంద్రవరం పునీతమైంది..
– రాజమహేంద్రవరం ఎంపీ భరత్
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్ : జగద్గురు కంచికామకోటి పీఠాధీశులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి రాజమండ్రి నగరంలో అడుగిడగానే ఈ నగరం పునీతమైందని, నగర వాసులు జన్మతరించిందని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు.బుధవారం రాత్రి నగరంలోని పవిత్ర గోదావరి పుష్కర ఘాట్ వద్ద ‘గోదావరి హారతులను’ వీక్షించేందుకు పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి తన శిష్యులు, భక్తులతో సహా కదలివచ్చారు. పీఠాధిపతికి పుష్కర ఘాట్ వద్ద ఎంపీ భరత్ స్వాగతం పలికారు. వేదపండితులు పూర్ణకుంభంతో శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. గోదావరి మాతకు కంచికామకోటి పీఠాధిపతి పూజలు నిర్వహించారు. పుష్పాలతో, కుంకుమార్చనలు నిర్వహించి, హారతులిచ్చారు. నూతన వస్త్రాన్ని గోదావరి మాతకు స్వామీజీ సమర్పించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో గోదావరి జలాన్ని శిరస్సుపై జల్లుకున్నారు. అనంతరం గోదావరి హారతులను తిలకించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ నిన్ననే సూర్యగ్రహణం సందర్భంగా విడుపు స్నానాన్ని ఈ పుష్కర ఘాట్లోనే పీఠాధీశులు నిర్వహించుకున్నారని చెప్పారు. మళ్ళీ ఈ రోజు గోదారమ్మ నిత్య హారతులను వీక్షించేందుకు రావడం మహద్భాగ్యమన్నారు. ఈ నగర వాసులందరిపైనా పీఠాధిపతి అనుగ్రహం ఉండాలని, అందర్నీ ఆశీర్వదించాల్సిందిగా ఎంపీ భరత్ కంచికామకోటి పీఠాధిపతులను కోరారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ కు పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ పూల కిరీటంతో సత్కరించి, దివ్య ఆశీస్సులు అందజేశారు.