పూజించే వారిలోనే కొలివై ఉండే అయ్యప్ప
శ్రీ పీఠం పూజ్యశ్రీ పరి పూర్ణానంద స్వామి
చక్రద్వారబంధంలో వైభవంగా పడిపూజ
ఘనంగా హరిహరుల కల్యాణం
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
అంశమే అయ్యప్ప స్వామి అని కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పూజ్య శ్రీ పరి పూర్ణానంద స్వామి అన్నారు. రాజానగరం మండలం చక్రద్వారబంధం శ్రీ ప్రణవ డవలపర్స్ ప్రాంగణంలో గురువారం రాత్రి వాడ్రేవు శ్రీను గరుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరిహరుల కల్యాణం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిపించారు.వేలాది మంది స్వాములు, భక్తులు హాజరై కల్యణాన్ని తిలకించారు ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా హాజరైన శ్రీ పీఠం పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. స్వామి మాట్లాడుతూ అయ్యప్పను పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అన్నారు. అయ్యప్ప ఆలయంలో నాలుగు ధ్వారాలు అంటే బ్రహ్మకు గల చతుర్ముఖాలు అని, విష్ణుమూర్తి యొక్క ముగ్ధ మనోహర రూపం కలిగిన అయ్యప్పకు పులి వాహనమని, పులిపై స్వారీ చేయగలవాడు ఆ రుద్రుడేనని అన్నారు. అయ్యప్పను పూజిస్తే పాపాలు తొలగడమే కాదని, తనను పూజించే వారిలో ఆ అయ్యప్ప స్వామే కొలొవై ఉంటాడని చెప్పారు. అయ్యప్ప దీక్ష ఎంతో కఠినమైన దీక్ష అన్నారు. మాల ధరించిన వారు అప్పటి వరకూ ఉన్న దురలవాట్లకు దూరం కావడమే కాకుండా, ఆ అయ్యప్ప సాక్షాత్కారం తప్ప ప్రపంచంతో తనకు పనిలేదు అన్నంత నియమ, నిష్టలతో గడుపుతారన్నారు. తాను పదకొండేళ్ళ వయస్సులో కన్నె స్వామిగా అయ్యప్ప కొండకు పరుగు పరుగున ఎక్కి ఆలయానికి చేరుకున్నానని, తనతో వచ్చిన వారు ఎవరూ తనతో లేరని, తీవ్రమైన ఆకలి, దప్పికతో ఉన్న తాను ఆహారం తీసుకోవాలంటే తలపై ఉన్న విరుముడి కిందకు దించడానికి లేదని, అటువంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి నా ఆకలిని ఎరిగి నా విరుముడిని తన తలను ధరించి, తన వద్ద ఉన్న ప్రసాదాలను ఇచ్చి ఆకలి తీర్చాడని, తమ వారు తనవద్దకు చేరేసరికి ఆయన కనిపించలేదని, ఆ అయ్యప్పే తన ఆకలి తీర్చడానికి మనిషి రూపంలో వచ్చాడని తన నమ్మకమన్నారు. అయ్యప్ప దీక్ష తర్వాత అంతటి ఉగ్రమైన దీక్ష భవానీ మాలధారణ అని చెప్పారు.తెలుగు రాష్ర్టాలలో అయ్యప్ప మాలధారణ చేసేవారు లక్షలాధిగా ఉంటారని, వారందరినీ ఒకచోటికి చేర్చి చేయిచేయి పట్టుకొని నిలబడితే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి శబరిమలై వరకు నిలబడతారని అన్నారు. మకరజ్యోతి లేదు అనేవారు దానిని చూడలేని గుడ్డువారని అన్నారు. భక్తులతో అడుగడుగునా ఉండి కాపాడే స్వామి ఆ అయ్యప్ప స్వామి అని అన్నారు. గత ముప్పై ఏళ్ళగా లక్షలాధి మందితో మాలధారణ చేయించి, శబరిమలై తీసుకు వెళుతున్న శ్రీను గురు స్వామి ధన్యులు అని అన్నారు. మెట్టు మెట్టుకు పదేపదే ఇష్టపడి చేసే పూజే పడిపూజ అన్నారు. పడిపూజ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, రుడా ఛైర్మన్ మేడపాటి షర్మిల రెడ్డి, డిసిసిబి ఛైర్మన్ ఆకుల వీర్రాజు, ప్రణవ డవలపర్స్ నూకల నరసింహారావు, పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. వాడ్రేవు శ్రీను గురు స్వామి, సోడసాని రామదుర్గం గురుస్వామి, తోరాటి తాతాజీ, నిర్వహణ కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.