WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ట్రేడ్ హబ్ గా కాకినాడకు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

ట్రేడ్ హబ్‌గా కాకినాడకు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక ప్రాత్ర

 

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

 

జేఎన్‌టీయూ ప్రాంగణంలో ఐఐఎఫ్‌టీ క్యాంప‌స్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్

 

 

కాకినాడ సిటీ,విశ్వం వాయిస్ న్యూస్ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) దక్షిణాది క్యాంప‌స్ ఏర్పాటుతో ట్రేడ్ హబ్‌గా కాకినాడ దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలక ప్రాత్ర పోషించ‌నుంద‌ని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శుక్రవారం ఉదయం కాకినాడ జేఎన్‌టీయూ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐఐఎఫ్‌టీ క్యాంప‌స్‌ను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఎన్‌టీయూ అలుమిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ అపారమైన ఎగుమతి సామర్థ్యాలతో పలుమార్లు ప్రాముఖ్య‌త చాటుకున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విదేశీ వాణిజ్యానికి హబ్ గా నిలుస్తున్న కాకినాడలో ఐఐఎఫ్‌టీ ఏర్పాటు ఎంతో సముచితమని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కల్పించక ముందే విశాలమైన సుమారు 700 తీర రేఖలో మెరైన్ ఉత్పత్తుల ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకుని, ఎగుమతి అవకాశాలను ఈ ప్రాంత ఎంటర్ ప్రెన్యూర్లు అందిపుచ్చుకున్నారని, అంతర్జాతీయ ప్రమాణాలతో విదేశీ వాణిజ్యంలో రాష్ట్రాన్ని ముందు వరసలో నిలిపారని ప్రశసించారు. అలాగే ఫార్మాస్యూటికల్స్, ఆటో, టెక్స్‌టైల్, రైస్, రైస్ బ్రాన్ ఆయిల్, పళ్లు, కూరగాయల వాణిజ్యానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అపార సామర్థ్యం ఉందన్నారు. రాష్ట్రాలు తమ తమ ఉత్పత్తులకు అంతర్జాతీయ ఎగుమతి అవ‌కాశాల‌ను విస్త‌రించుకునేందుకు విదేశీ ఎంబసీలలో ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ ఆఫీసుల ఏర్పాటుకు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించిన అంశాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలోని పలు రాష్ట్రాలు ఎన్నో యూరోపియన్ దేశాల కంటే వైశాల్యం ప‌రంగా పెద్దవిగా ఉన్నాయని, వాటిలో ఒక్కొక్క జిల్లా, ఒక్కో విశిష్ట ఉత్పత్పికి కేంద్రంగా ఉందన్నారు. ఈ వైవిధ్య‌మైన ఉత్పత్తులకు ప్రోత్సాహాలను కల్పించేందుకే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడెక్ట్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. అలాగే ఎన్నో స్థానిక ఉత్పత్పులు అంతర్జాతీయ ఆదరణ చూరగొంటున్నాయని, వాటి ఎగుమతుల ప్రోత్సాహనికి రాష్ట్రాలు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఐ.ఐ.ఎఫ్.టి విద్యార్థులు తమ కోర్సును కేవలం అకడమిక్ డిగ్రీ సాధనలా కాకుండా ప్రపంచ వాణిజ్య స్థితిగతులు, సదవకాశాలను నిరంతరం అధ్యయనం చేస్తూ విధాన రూపకల్పనల్లో కేంద్ర వాణిజ్య శాఖకు సూచనలు అందిస్తూ, దేశ ఆర్థిక పురోగతిలో నిర్మాణాత్మక భాగస్వాములు కావాలని ఆమె కోరారు. దేశ రాజధాని న్యూడిల్లీలోని క్యాంప‌స్‌, బ్రిటీష్ ప్రెసిడెన్సీలో కొనసాగిన కలకత్తాలోని క్యాంప‌స్‌ల కంటే ఐ.ఐ.ఎఫ్.టి. కాకినాడ క్యాంప‌స్ భిన్నమైనదని, వివిధ ఎగుమ‌తుల‌తో విదేశీ వాణిజ్యంలో కీలక పాత్ర వహిస్తున్న కాకినాడ ప్రాంతంలో ప్రత్యక్ష పరిశీలన ద్వారా విద్యార్థులకు మరింత సమగ్రమైన, క్షేత్ర‌స్థాయి నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు అవ‌కాశం లభించగలదన్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర సత్వరాభివృద్ది లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం, ప్ర‌ధాన‌మంత్రి చొర‌వ‌తో ఎయిమ్స్‌, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్‌, ఎన్ఐడీ, ఐఐఎఫ్‌టీ, ఐఐపీ త‌దిత‌ర ప‌ది ప్రతిష్టాత్మక సంస్థలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేస్తోంద‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు.

 

కేంద్ర వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌లు, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ఆహారం, ప్ర‌జా పంపిణీ, టెక్స్‌టైల్స్ మంత్రి పీయూష్ గోయ‌ల్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌, చొర‌వ వ‌ల్లే కాకినాడ‌లో ఐఐఎఫ్‌టీ క్యాంప‌స్ ఏర్పాటైంద‌న్నారు. ఈ క్యాంప‌స్ ఏర్పాటు స‌రికొత్త అధ్యాయానికి నాంది ప‌లికింద‌ని, భార‌తీయ వాణిజ్యానికి భ‌విష్య‌త్తులో మ‌రింత‌గా అంత‌ర్జాతీయ గుర్తింపు రావాలంటే నిపుణులైన మేనేజ్‌మెంట్ మాన‌వ వ‌న‌రులు అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. ఈ మాన‌వ వ‌న‌రులు ఐఐఎఫ్‌టీల ద్వారా అందుబాటులోకి రానున్నాయ‌ని భాగ‌స్వామ్య పూర్తితో అడుగేస్తే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌, రాజ‌కీయ సుస్థిర‌త‌, అత్యున్న‌త పోటీత‌త్వం, స‌మ‌ష్టి కృషికి నెల‌వైన భార‌త్ ప్ర‌ధాన‌మంత్రి, ఆర్థిక మంత్రి సీతారామ‌న్ వంటి స‌మ‌ర్థ‌వంతమైన నేతృత్వంలో ప్ర‌పంచ ఆర్థిక శ‌క్తిగా ఎదుగుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ 3.5 ట్రిలియ‌న్ అమెరికా డాల‌ర్లుగా ఉంద‌ని.. వ‌చ్చే 25 ఏళ్ల అమృత్ కాలంలో ఈ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప‌ది రెట్లు పెంచేలా కృషిచేస్తే వందేళ్ల స్వ‌తంత్ర భార‌త్ ఆవిష్కృతం కానున్న 2047 నాటికి 30 ట్రిలియ‌న్ అమెరికా డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్‌ను తీర్చిదిద్దాల‌నే దార్శ‌నిక ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డం క‌ష్ట‌మేమీ కాద‌న్నారు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ప్యాకేజీ కింద కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లు, ప్ర‌త్యేక బ‌డ్జెట్‌లు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం, సుసంప‌న్నం చేశాయ‌ని.. స‌మ్మిళిత ఆర్థిక వృద్ధి, స‌మ‌ష్టి కృషితో అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం స్థాయికి తీసుకెళ్లొచ్చ‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్య‌వ‌సాయం, మ‌త్స్య త‌దిత‌ర రంగాల్లో ఎంతో వృద్ధి సాధిస్తోంద‌ని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్ర‌త్యేక ఆర్థిక మండ‌ళ్లు ఉన్నాయ‌న్నారు. నిపుణులైన మాన‌వ వ‌న‌రుల‌ను అందుబాటులోకి తేవ‌డం ద్వారా మ‌రింత అభివృద్ధిని సాధించొచ్చ‌న్నారు. స్థానిక ఉత్ప‌త్తుల‌ను, హ‌స్త క‌ళాకారుల‌ను, వృత్తి నైపుణ్య‌మున్న చేనేత కార్మికులు వంటి వారిని ప్రోత్స‌హించాల‌ని.. వారికి అన్ని విధాలా మ‌ద్ద‌తుగా నిలబ‌డ‌టం ముఖ్యమ‌ని మంత్రి పీయూష్ గోయ‌ల్ పిలుపునిచ్చారు.

 

భార‌తీయ విదేశీ వాణిజ్య సంస్థ (ఐఐఎఫ్‌టీ) ద‌క్షిణ భార‌త క్యాంప‌స్‌ను కాకినాడ‌లో ఏర్పాటుచేసినందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, గౌర‌వ ముఖ్య‌మంత్రి త‌ర‌ఫున కేంద్ర ప్ర‌భుత్వానికి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ప‌శుసంవ‌ర్ధ‌క‌, పాడిప‌రిశ్ర‌మ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు తెలిపారు. ఐఐఎఫ్‌టీకి ఢిల్లీలో ఒక క్యాంప‌స్‌, కోల్‌క‌తాలో ఒక క్యాంప‌స్ ఉంద‌ని ఇప్పుడు కాకినాడ‌లో క్యాంప‌స్ ఏర్పాటైంద‌ని, ఆ మ‌హాన‌గ‌రాల‌కూ కాకినాడ‌కు పోలిక ఏంట‌నే అనుమానాలు అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే రెండు పోర్టులు డీప్‌వాట‌ర్‌, యాంక‌రేజ్ పోర్టులున్న గొప్ప న‌గ‌రం కాకినాడని పేర్కొన్నారు. మూడో పోర్టు కూడా రానుంద‌ని ఎస్ఈజెడ్‌లో కాకినాడ ఐఐఎఫ్‌టీ శాశ్వ‌త క్యాంప‌స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్ర‌భుత్వం 25 ఎక‌రాలు కేటాయించిన‌ట్లు వెల్ల‌డించారు. అక్క‌డ త్వ‌ర‌లోనే అత్యాధునిక‌, అంద‌మైన క్యాంప‌స్ నిర్మాణం కానుంద‌న్నారు.

బియ్యం, ఆక్వా ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల‌కు కాకినాడ మంచి వేదిక‌గా ఉందని రాష్ట్ర ఎగుమ‌తుల్లో అధిక ఎగుమ‌తులు కాకినాడ నుంచే జ‌రుగుతున్నాయ‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఐఐఎఫ్‌టీ విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన క్షేత్ర‌స్థాయి నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు కాకినాడ అనువైన ప్రాంత‌మ‌ని అందుకే కేంద్రం ఇక్క‌డ క్యాంప‌స్ ఏర్పాటుకు మందుకొచ్చిన‌ట్లు వివ‌రించారు. ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు గ‌ర్వ‌కార‌ణ‌మని ఈ సంస్థ ఏర్పాటుతో భార‌త చిత్ర‌ప‌టంలో కాకినాడ ప్ర‌తిష్ట మ‌రింత పెరుగుతుంద‌న్నారు. భార‌తీయ ఎగుమ‌తుల్లో 5.8 శాతం ఎగుమ‌తులు (దాదాపు 16.8 బిలియ‌న్ యూఎస్ డాల‌ర్లు) ఏపీ నుంచి జ‌రుగుతున్నాయ‌ని రాష్ట్ర ఎగుమ‌తుల పురోగ‌తిని ప‌రిశీలిస్తే గ‌తంలో 20వ స్థానంలో ఉండేవార‌మ‌ని 2021 నాటికి 9వ స్థానానికి చేరుకున్నామ‌ని స‌గ‌ర్వంగా చెబుతున్నామ‌న్నారు. ఆక్వా ప‌రిశ్ర‌మ‌ రాష్ట్ర ఎగుమ‌తుల్లో కీల‌కంగా నిలుస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ భార‌త ఆక్వాహ‌బ్‌గా గుర్తింపు సాధించింద‌ని.. చేప‌లు, రొయ్య‌ల ఉత్ప‌త్తిలో రాష్ట్రం దేశంలోనే మొద‌టి స్థానంలో ఉంద‌న్నారు. దేశ మెరైన్ ఎగుమ‌తుల్లో రాష్ట్ర వాటా 30 శాతంతో మూడో స్థానంలో ఉంద‌ని తెలిపారు. చైనీస్‌, అమెరికా కొనుగోలు దారుల నుంచి ఎదుర‌య్యే స‌మ‌స్య వ‌ల్ల రాష్ట్ర ఆక్వా ప‌రిశ్ర‌మ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు) చేసుకోవ‌డం ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే వీలుంద‌ని ఈ విష‌యంపై కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిశీల‌న చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ ఒప్పందాలు అమ‌ల్లోకి వ‌స్తే దేశ‌, రాష్ట్ర స్థూల స‌మ‌కూరిన విలువ (జీవీఏ) వృద్ధికి రాష్ట్ర ఆక్వా రంగం మ‌రింత తోడ్ప‌డుతుంద‌ని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు పేర్కొన్నారు.

 

 

నేటి త‌రం మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శ‌వంత‌మైన‌, స్ఫూర్తిదాయ‌క‌మైన మ‌హిళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. ఆమె ఏ శాఖ‌లో ఉన్న‌ప్ప‌టికీ త‌మ‌దైన ముద్ర వేశార‌న్నారు. నిర్మ‌లా సీతారామ‌న్ కామ‌ర్స్ మినిస్ట‌ర్‌గా ఉన్న‌ప్పుడు రాష్ట్రానికి ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ), ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ప్యాకేజ్ (ఐఐపీ) ఇన్‌స్టిట్యూట్‌ల‌ను మంజూరు చేసిన‌ట్లు తెలిపారు. ఎంపీ అయిన త‌ర్వాత మొద‌టిగా ఐఐఎఫ్‌టీ, ఐఐపీపై ప్ర‌శ్న ఎదురైంద‌ని.. అదే విధంగా తొలిసారిగా ఎస్ఈజెడ్ రైతుల స‌మ‌స్య‌ల‌పై మాట్లాడిన‌ట్లు వెల్ల‌డించారు. ఐఐఎఫ్‌టీ కేంద్ర ఆర్థిక మంత్రి చేతులు మీదుగా ప్రారంభ‌మైంద‌ని.. అదే విధంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కృషి కార‌ణంగా రెండువేల ఎక‌రాల‌ను ఎస్ఈజెడ్ రైతుల‌కు తిరిగి ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. వారికి ఈ విధంగా న్యాయం జ‌రిగింద‌న్నారు. మూడు కోట్ల రూపాయ‌ల‌తో మూడు చేనేత క్ల‌స్ట‌ర్‌ల‌ను మంజూరు చేసినందుకు జిల్లా చేనేత కార్మికుల త‌ర‌ఫున కేంద్ర వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. కొత్త‌గా ఏర్ప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ముఖ్య‌మంగా కేంద్ర ఆర్థిక మంత్రి మ‌ద్ద‌తుతో మ‌రింత అభివృద్ధి చెంద‌గ‌ల‌ద‌ని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌, పౌర స‌ర‌ఫ‌రాల మంత్రి కారుమూరి వెంక‌ట‌నాగేశ్వ‌ర‌రావు, బీసీ సంక్షేమం, ఐ అండ్ పీఆర్‌, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, రాష్ట్ర ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, పార్ల‌మెంటు స‌భ్యులు జీవీఎల్ న‌ర‌సింహ‌రావు, పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్‌, మార్గాని భ‌ర‌త్‌రాం, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఎస్‌.ఎస్‌.రావ‌త్‌, జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, ఎస్‌పీ ఎం.ర‌వీంద్ర‌నాథ్‌బాబు, జెడ్‌పీ ఛైర్మ‌న్ విప్ప‌ర్తి వేణుగోపాల‌రావు, ఎమ్మెల్సీ సోమువీర్రాజు, ఎమ్మెల్సీ చిక్కాల రామ‌చంద్ర‌రావు, ఎమ్మెల్యేలు కుర‌సాల క‌న్న‌బాబు, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌రరెడ్డి, ఐఐఎఫ్‌టీ వైస్‌ఛాన్స‌ల‌ర్ ప్రొఫెస‌ర్ మ‌నోజ్‌పంత్‌, ఐఐఎఫ్‌టీ సెంట‌ర్‌హెడ్ ప్రొఫెస‌ర్ వి.ర‌వీంద్ర‌సార‌ధి, ఓఎస్‌డీ టి.బాబూరావు నాయుడు, జేఎన్‌టీయూ వీసీ డా. జీవీఆర్ ప్ర‌సాదరాజు, రిజిస్ట్రార్ డా. ఎల్‌.సుమ‌ల‌త‌, కుడా ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌క‌ళాదీప్తి త‌దిత‌ర ప్ర‌ముఖులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement