విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
ఆ రెండు పార్టీలతోనే రాష్ట్రంలో అశాంతి
– చంద్రబాబు కోసమే పవన్ డ్రామాలు
– ప్రజలందరూ గమనిస్తున్నారు
– పారదర్శకంగా సంక్షేమ పథకాలు..
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్: రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీల వలనే అశాంతి, అలజడి నెలకొంటోందని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ఇది చూసి ఓర్వలేని ఈ రెండు పార్టీలూ రకరకాల రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయన్నారు. ఆదివారం దివాన్ చెరువు పుష్కర వనంలో గౌడ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో శెట్టిబలిజ, గౌడ, ఈడిగ, శ్రీశయన, యాత సామాజిక వర్గీయుల కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలన్నీ గమనిస్తున్నారని, విజ్ఞతతో ఆలోచిస్తారన్నారు. పవన్ కల్యాణ్ 2014లో జనసేన పార్టీ పెట్టి, ఎన్నికలలో పోటీ చేయకుండా చంద్రబాబుకు మద్దతిచ్చారని, మళ్ళా 2019 ఎన్నికలలో అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి ఎన్నికలలో పోటీ చేశారన్నారు. 2024లో చంద్రబాబుకు మద్దతుగా ఆయన పనిచేయడానికే రకరకాల డ్రామాలు ఆడుతున్నారన్నారు. అసలెవరైనా పార్టీ పెడితే ఎన్నికలలో పోటీ చేయడానికే గానీ..ఇలా మరో పార్టీ గెలుపుకోసం ఎవరూ పనిచేయరన్నారు. జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంలో కుల, వర్గ, ప్రాంత రహితంగా..పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తోందన్నారు. ఇప్పటి వరకూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను సీఎం జగనన్న ఎంతో సమర్థవంతంగా అమలుచేస్తూ అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారని, ఇది మాకెంతో గర్వకారణంగా ఉందన్నారు. కార్తీక వన సమరాధనల పేరుతో అన్ని కులాలు ఆయా సామాజిక వర్గీయుల ప్రముఖులు, పెద్దలతో నిర్వహించుకుంటారని..అదే మాదిరిగా రాజమండ్రిలో శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో ఉప కులాలైన శెట్టి బలిజ, గౌడ, ఈడిగ, శ్రీశయన, యాత కులాలకు చెందిన సుమారు యాభై వేల మందితో ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం కావడం సంతోషమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల జనాభా కలిగిన అతిపెద్ద వర్గం శెట్టి బలిజ సామాజిక వర్గమేనన్నారు. బీసీలు రాజకీయంగా, సామాజిక పరంగా ఏ విధంగా చైతన్యవంతులు కావాలి, సంఘటితంగా ఎలా పనిచేయాలి తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించుకుని పలు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. జగనన్న పాలనలో అన్ని కులాల వారికీ సంక్షేమ పథకాల పేరుతో పెట్టుబడి నిధి అందజేస్తున్నారని చెప్పారు. బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్ర కులాల్లో ఈబీసీలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నది ఒక్క జగనన్న పాలనలోనేనని సగర్వంగా చెప్పగలమని ఎంపీ భరత్ అన్నారు. కాపు సామాజిక వర్గ మహిళల బ్యాంకు ఖాతాలలో కాపు నేస్తం పేరుతో సంవత్సరానికి రూ.15వేలు నేరుగా జగన్ జమ చేస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ సమాజిక వర్గీయులు కూడా సోమవారం (నేడు) కార్తీక వన సమారాధన నిర్వహించుకుంటున్నట్టు తెలిసిందన్నారు. పార్టీ పటిష్టత కోసమే అన్ని నియోజకవర్గాలలో ఇన్చార్జుల నియామకం తప్పిస్తే మరేమీ లేదని మరో ప్రశ్నకు సమాధానంగా ఎంపీ భరత్ వెల్లడించారు.