– రావులపాలెంలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్థంతి
విశ్వంవాయిస్ న్యూస్, రావులపాలెం:
కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాల సాధనకు విశేష కృషి చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా ఎస్సీల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని బీజేపీ ఎస్సీ మోర్చా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి పొనుగుపాటి శ్రీనివాస్ ధ్వజమెత్తారు.
భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ బస్తీ సంపర్క అభియాన్ -2022 కార్యక్రమంలో భాగంగా రావులపాలెం ఇందిరా కాలనీలోని అంబేద్కర్ పార్కులో మంగళవారం అంబేద్కర్ 66వ వర్థంతిని ఆయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొనుగుపాటి శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఎస్సీలకు అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ముద్రించిన కర పత్రాలను ఎస్సీ కాలనీల్లో పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఎస్సీలకు అందాల్సిన సంక్షేమ పథకాలను పక్కన పెట్టి వారిని తీవ్రంగా మోసగిస్తోందన్నారు. ఎస్సీలకు పెద్ద పీట వేసి ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 12 మంత్రి పదవులను ఎస్సీలకు కేటాయించడం బీజేపీ ఎస్సీలకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవన విధానాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఆయన స్మృత్యర్థం ఐదు పంచ తీర్థాలను వేల కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తుంటే, జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న కోటి పది లక్షల మంది ఎస్సీ జనాభాను నిర్లక్ష్యం చేస్తూ వారికి అందాల్సిన సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బ తీస్తుందని ఆరోపించారు. సిఎం దగ్గర ఉన్న ఐఏఎస్ అధికారి నుంచి స్థానికంగా ఉండే ఎంపీడీవో వరకు ఎవరి దగ్గర కూడా ఎస్సీల అభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక లేకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఎస్సీ కాలనీల్లో మౌళిక వసతుల కల్పనలో తీవ్రంగా వైఫల్యం చెందిందని, కనీసం డ్రైనేజీలు, రోడ్లు, స్మశాన వాటికలు కూడా లేకపోవడం దీనిని తేటతెల్లం చేస్తుందన్నారు…