విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట:
పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న వారందరికీ పింఛన్లు అందజేస్తున్నామని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా మంజూరైన పింఛన్లను గురువారం ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు వచ్చిన వారందరికీ పింఛన్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. అయితే జనవరి, జులై నెలలో కొత్త పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఈలోగా 60 సంవత్సరాలు వయసు దాటిన వారు తమకు పెన్షన్ రాలేదని ఆవేదన చెందకుండా, వాలంటీర్లు ద్వారా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ లోపు మంజూరైన నూతన పింఛన్లను జనవరి, జూలై నెలలో అందజేస్తామని వివరించారు. పేదలు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్గన గంగాధరరావు, జడ్పిటిసి గూడపాటి రమాదేవి, వైసీపీ నాయకులు రెడ్డి చంటి, కుడుపూడి వెంకటేశ్వరరావు, దూనబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.