విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం సిటీ:
అయ్యప్ప భక్తులు ఎంతో నిష్టగా కొలిచే హరిహరసుతుడు అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణకు చెందిన బైరి నరేష్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అయ్యప్ప భక్త సమాజం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నగరంలో నిరసన ప్రదర్శన,భారీ బైక్ ర్యాలీ జరిగింది. వి.ఎల్.పురం వినాయకుడి గుడి వద్ద నుంచి పెద్ద సంఖ్యలో బైక్ ల మీద ప్రదర్శనగా బయలుదేరిన అయ్యప్ప భక్తులు ఆర్టీసీ కాంప్లెక్స్, రామకృష్ణ థియేటర్,తాడితోట, స్టేడియం రోడ్డు, శ్యామలా థియేటర్ సెంటర్, మీదుగా విశ్వేశ్వర స్వామి గుడివద్దకు చేరుకున్నారు.అనంతరం అక్కడ బైరి నరేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.తిరిగి అక్కడినుంచి గౌతమ ఘాట్ సమీపంలోని అయ్యప్పస్వామి ఆలయం వద్దకు చేరుకుని హిందూ వ్యతిరేక తీవ్రవాది బైరి నరేష్ పై పి.డి.యాక్టు నమోదు చేయాలని,హిందూ ధర్మాన్ని రక్షించాలని మరోసారి నినాదాలు చేశారు.ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి జన్మ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసే అర్హత, హక్కు, బైరి నరేష్ కు లేదని మండిపడ్డారు.మాల వేసుకునే భక్తులు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారని నరేష్ అనడం సమంజసం కాదన్నారు.అయ్యప్పమాల ధరించే భక్తులు 41 రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో సంతోషంగా స్వామిని సేవించి తరిస్తారు, ఆరోగ్యంతో ఉంటారుతప్ప,ఎవరూ కష్టం అనుకోరని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో హిందూ దేవుళ్ళను,హిందూ ధర్మాన్ని విమర్శించడం ప్రతి ఒక్కరికీ అలవాటుగా మారిందని దీనిని అడ్డుకట్ట వేసేందుకు బైరి నరేష్ లాంటి వ్యక్తులు ఇకముందు హిందూ దేవుళ్ళను భక్తులను కించపరిచే విధంగా మాట్లాడకుండా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని గురుస్వాములు కోరారు.అనంతరం వారంతా ప్రదర్శనగా గోదావరి గట్టు, మార్కండేయ స్వామి ఆలయం, పుష్కర ఘాట్, మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని ఒక వినతిపత్రం అందజేశారు.