– చంద్రబాబు ఏమి చేసారు రాష్ట్రానికి, అందుకే ప్రజలు నమ్మడంలేదు
– కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
విశ్వంవాయిస్ న్యూస్, రాజమండ్రి సిటీ:
అన్ని వర్గాల ప్రజలు జగన్ ఎప్పుడు దిగిపోతారా అని ఎదురు చూస్తున్నారని, మాజీ సీఎం చంద్రబాబును నమ్మడంలేదని అందుకే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ మాజీ ఎంపి చింతామోహన్ చెప్పారు.రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు మంచి స్పందన వచ్చిందన్నారు.
2024లో దేశంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయమన్నారు.
రాష్ట్రంలో కాపుల్ని ముఖ్యమంత్రిగా చేసే బాధ్యతను తీసుకుని కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడతానని చింతా మోహన్ చెప్పారు.
దేశంలో, రాష్ట్రంలో నిరుపేదలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ సీట్లకు 100 స్థానాలు, 15 నుంచి 20 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందన్నారు. అధిక ధరలు,పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపుతాయన్నారు.రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని,జగన్ ఎప్పుడు ఇంటికి పోతారా అని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. నిరుపేదల ఆక్రోశం, ఆకలి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెస్తుందని చెప్పారు.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీపై దేశవ్యాప్తంగా సానుకూల పవనాలు వీస్తున్నాయని అన్నారు.
రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా విప్లవాత్మకమైన పెను మార్పులు రావడం ఖాయమని,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఉభయ గోదావరి జిల్లాలకు కానీ, రాజమహేంద్రవరానికి కాని చేసింది ఏమీ లేదన్నారు.టిడిపి, వైఎస్ఆర్సిపి ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచాయని ధ్వజమెత్తారు.విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మార్టిన్ లూథర్,నలబాటి శ్యామ్,పిల్లా సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.