విశ్వంవాయిస్ న్యూస్, మోతుగూడెం:
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు,రైతులు విద్యుత్ అధికారుల తీరుతో,తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనడానికి నిలువెత్తు నిదర్శనమే మోతుగూడెం ఘటన.ఇది ఎక్కడో కాదు, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అరటి పంటలు ఎండిపోయి,రైతులు నష్టాల బారిన పడడంతో ట్రాన్స్ఫార్మర్ రూపంలో రైతుల తలపై పిడుగు పడిందని చెప్పవచ్చు.
ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే చింతూరు మండల పరిధిలోని మోతుగూడెం గ్రామంలో సాధారణ రైతు కుటుంబానికి చెందిన వేగి. దార నాగేశ్వరరావు మరియు ఇతర రైతులు 30 రోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో స్థానిక లైన్ మెన్ మరియు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.అయినా పట్టించుకోలేదు. అధికారులు పట్టించుకోకపోవడంతో అరటితోట పూర్తిగా ఎండిపోయింది, ఇదివరకు రైతులే సొంత ఖర్చులతో ట్రాన్స్ఫార్మర్ని భద్రాచలం తీసుకొని వెళ్లి బాగుచేయించుకున్నారు. ఇక బాగుచేయించుకునే స్థోమత లేక, పట్టించుకునే నాధుడు లేక కన్నీటి పర్యంతం అయ్యారు.ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేదన్నారు, వేగి. దార నాగేశ్వరావు తో పాటు ఇదే ట్రాన్స్ఫార్మర్ కింద మరికొంత మంది రైతులు అరటితో పాటు, ఇతర పంటలు సాగుచేశామని అందరి పరిస్థితి ఇలాగే ఉందని యువ రైతు నాగేంద్ర తెలిపారు.అరటి పంట మంచిగా వస్తే చేసిన అప్పులు తీరుతాయని భావించామని,విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కోలుకోకుండా అయ్యామని,ఒక్కొక్క రైతు లక్ష పైగా పెట్టుబడి పెట్టామని,సకాలంలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసి నీళ్ళు అంది ఉంటే ఒక్కొక్క రైతుకు 2 లక్షల వరకు ఆదాయం వచ్చేదని,ఇప్పుడు తమను ఎవరు ఆదుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తూ,తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.