విశ్వంవాయిస్ న్యూస్, మోతుగూడెం:
అల్లూరి సీతారామరాజుజిల్లా,చింతూరు మండలం, మోతుగూడెం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పొల్లూరు గ్రామంలో సోమవారం నాడు శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర సందర్భంగా, ఒరిస్సా, ఆంధ్ర రాష్ట్రాలను ఏకం చేస్తూ , ఈ పెద్ద యాత్రకు విచ్చేయనున్న భక్తుల సౌకర్యార్థం దృష్ట్యా ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో తాత్కాలిక నీటిలో తేలియాడే వంతెన నిర్మించారు. ఈ వంతెనపై ఒకేసారి వందమందికి పైగా రాకపోకలు సాగించవచ్చు. ఈ వంతెన సుమారు 200 మీటర్లు ఉంటుందని అంచనా, ఇదివరకు ఈ జాతరకు వనదేవతలను ( భయభ్రాంతుల మధ్య) నాటు పడవల సహాయంతో సీలేరు నది దాటించి పొల్లూరు టైగ్రిస్ జలపాతం వద్ద ముత్యాలమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో మంగళ స్నానాలు చేయించేవారు. ఈ సందర్భంగా మన్యంకొండ జాతర కమిటీ సభ్యులు అయినటువంటి కరోసి.మల్లికార్జున్, ఎం.కుమార్, గేదెల. వరప్రసాద్(బుజ్జి ) మాట్లాడుతూ సోమవారం నాడు జరిగే ఈ పెద్ద జాతరకు నీటిలో తేలియాడే దృఢమైన తాత్కాలిక వంతెన నిర్మాణం వల్ల అంచనాలకు మించి భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, వచ్చే భక్తులందరికీ ఆహారం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా భక్తుల శాంతి భద్రతల దృష్ట్యా పోలీసు శాఖ వారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ నీటిలో తెలియాడే వంతెన పైకి ప్రస్తుతానికి జాతర కమిటీ సభ్యులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. సోమవారం నుంచి పెద్ద యాత్రకు విచ్చేసే భక్తజన సంద్రోహం, ఈ వంతెనపై ఆనందోత్సాహాల నడుమ రాకపోకలు సాగించనున్నట్లు తెలిపారు.