విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
రంగుల ప్రపంచం చూపిస్తున్న చిత్రకళా ప్రదర్శన
– కుంచెతో అద్భుతాలు చేసిన చిత్రకారులు
– ఎన్నెన్నో ఊసులు, మరెన్నో భావాలు పలికిస్తున్న చిత్రాలు
– ఆర్ట్ విలువ అందరికీ తెలియ చేయాలని
– గువ్వల బిందు
రాజమహేంద్రవరం,విశ్వంవాయిస్ న్యూస్: చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన ఆ చిత్రాలు సందర్శకులను అద్భుత లోకంలోకి తీసుకువెళ్ళాయి.రంగుల ప్రపంచం చూపించాయి. ఎన్నెన్నో వర్ణాలు…మరెన్నో అందాలు.. ప్రకృతి లోని వింతలను విశేషాలను సజీవంగా కళ్ళకు కట్టినట్లు చిత్రకారులు చూపించారు. ఆ చిత్రాలు రవివర్మ, దామెర్ల రామారావు వంటి ప్రఖ్యాత చిత్రకారులు వేసినవికాదు. వారంతా ఔత్సాహిక చిత్రకారులు.ప్రముఖ చిత్రకారుడు దివంగత గువ్వల కెనడీ సతీమణి, చిత్రకారిణి గువ్వల పద్మ,కుమార్తె గువ్వల బిందు స్థాపించిన క్రియేటివ్ ఆర్ట్ వరల్డ్ ఆధ్వర్యంలో కళాస్మృతి -2023 చిత్రకళా ప్రదర్శన రెండు రోజుల పాటు హోటల్ లా అస్పిన్ లో జరిగింది.దీనిలో ఏడేళ్ళ వయసు నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన 11 మంది ఔత్సాహిక చిత్రకారులు పాల్గొని180 చిత్రాలను ప్రదర్శించారు.ఇందులో అల్ట్రాక్ పెయింటింగ్స్,వాటర్ కలర్ పెయింటింగ్స్,ఆయిల్ పోస్టర్స్,అక్రెలిక్ పెయింటింగ్స్,రెసిన్ ఆర్ట్ ను ప్రదర్శించారు.అన్నిరకాల పెయింటింగ్స్ తో ఏర్పాటు చేసిన ఈ చిత్రకళా ప్రదర్శన సందర్శకులను రంగుల లోకం లోకి తీసుకొని వెళ్ళాయి..చిత్రకారులు అక్కడికక్కడే వేసిన చిత్రాలు అబ్బుర పరిచాయి. చిత్రలేఖనంలో రాజమండ్రి పేరు చెబితే ప్రఖ్యాత చిత్రకారుడు దామెర్ల రామారావు గుర్తుకొస్తారు.ఆయన వారసత్వాన్ని తర్వాత కాలంలో ఎంతో మంది చిత్రకారులు అందిపుచ్చుకుని అద్భుత చిత్రాలు వేసి మెప్పించారు. వారిలో గువ్వల కెనడీ ఒకరు.ఇతర ప్రాంతాలలో చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి రాజమండ్రి చిత్రకారుల ఖ్యాతిని అందరికీ తెలియ చేసేవారు కెనడీ.ఆయన తరువాత ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ గువ్వల పద్మ కుమార్తె గువ్వల బిందు కళాస్మ్రతి పేరుతో ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.తెలుగు చలన చిత్ర రంగంలో ఆర్ట్ డైరెక్టర్ గా కొంత కాలం పనిచేసిన గువ్వల బిందు ఇప్పుడు తన కార్యస్థానాన్ని రాజమండ్రికి మార్చారు.
ఆర్ట్ విలువ అందరికీ తెలియ చేయాలని:
గువ్వల బిందు:
ఈ సందర్భంగా గువ్వల బిందు మాట్లాడుతూ ఆర్ట్ విలువ అందరికీ తెలియ చేయాలని కళాస్మృతి ఆర్ట్ ఎగ్జిబిషన్ ద్వారా కృషి చేస్తున్నట్లు చెప్పారు.తన తండ్రి చిత్రకళా వారసత్వాన్ని కొన సాగిస్తూ తమ తల్లి సంవత్సరానికి 80-90 మంది చిత్రకారులను తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. విద్యార్థుల్లో చిత్రలేఖనం పట్ల ఆసక్తి పెంచేందుకు వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామన్నారు.వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారైనా చిత్రలేఖనం నేర్చుకోవచ్చన్నారు.అయితే వేసే చిత్రాలు సమాజానికి సందేశం ఇచ్చేలా, ప్రకృతి పట్ల ఆరాధన, పర్యావరణం పట్ల బాధ్యత పెంచేలా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు గువ్వల బిందు చెప్పారు.