విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం
ఎలుకల నివారణ పై రైతులకు అవగాహన,శిక్షణ సమావేశం
విశ్వం వాయిస్ న్యూస్ రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో ఆర్కేవివై పథకం క్రింద జిల్లా వనరుల కేంద్రం ముమ్మిడివరం వారి సౌజన్యంతో సామూహిక ఎలకల నివారణ పై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి కే ప్రభాకర్ తెలిపారు.
ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ కార్యాలయం నుండి వచ్చినటువంటి ప్రత్యేక అధికారి డి.వెంకటేశ్వర్లు డిడిఏ-ఆర్ఎస్ కే మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా సామూహికంగా చేస్తేనే ఎలుకలను పూర్తిస్థాయిలో నివారించడానికి అవకాశం ఉంటుందని రైతులందరూ కూడా ఈకార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియపరుస్తూ,సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం వలన రైతులకు ఎటువంటి మేలు జరుగుతుందని రైతులని అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆత్మ పిడివై జ్యోతిర్మయి మాట్లాడుతూ వరిలో విత్తనం వేసిన దగ్గర నుండి కోత కోసే వరకు కూడా రైతుకు శత్రువు ఎలుకని వివరిస్తూ, ఎలుకల సంతతిని ఏ విధంగా పెంచుకుంటాయి, రైతులకు వివరించడం జరిగింది.ఒక జత ఎలుకల నుండి సంవత్సరంలో 1200 నుంచి 2,200 ఎలుకల సంతతిని పెంచుకుంటాయని దీనిని రైతులు గమనించి సామూహికంగా ఎలుకలు నివారించకపోతే దిగుబడిపై అధిక ప్రభావం చూపుతుందని రైతులకు విజ్ఞప్తి చేశారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏరువాక కేంద్రం సైంటిస్ట్ డాక్టర్ ఎం.నందకిషోర్ మాట్లాడుతూ రైతులకు ప్రస్తుతం వస్తున్న తెగుళ్లు పురుగులు గురించి వివరిస్తూ వాటిని నివారణ చర్యలను గూర్చి రైతులకు వివరించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పాము పడతగులు లేదా మా గుడి తెగులు ఎక్కువగా ఆశిస్తుందని దీని నివారణకు గట్లను శుభ్రంగా కలుపు లేకుండా చేయడమే కాకుండా పొలంలో కూడా కలుపు లేకుండా శుభ్రంగా ఉంచాలని రైతులకు తెలియపరుస్తూ ప్రొఫినోకోనోజోల్ 1 ఎమ్ఎల్ లేదా వ్యాలీడమైసిన్ 2 ఎమ్ఎల్ లేదా హెక్సాకనోజోల్ 2 ఎమ్ఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని 200 లీటర్ల మందు ద్రావణమును ఒక ఎకరమునకు బాగా తడిచే విధంగా పిచికారి చేసుకోవాలని,మరల 15 రోజుల తర్వాత ఒకసారి పిచికారి చేసినట్లయితే ఈ తెగలను పూర్తిగా నివారించవచ్చు అని తెలియపరిచారు. అదేవిధంగా అక్కడక్కడ ఆకు ఎండు తగులు లేదా బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ కనిపిస్తుందని,ఇది కనిపించిన పొలంలో నత్రజని ఎరువులను వేయకూడదని తెలియపరుస్తూ పంట పొలానికి కొత్తగా నీరు పారిస్తూ ప్లాన్టామైసిన్ మందును పిచికారి చేయాలని తెలియపరిచారు.రైతులు ఎవరు కూడా విచక్షణారహితంగా పురుగుమందులను పిచికారి చేయరాదని వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ అవసరమైన మేరకు మాత్రమే పురుగుమందులు పిచికారి చేయాలని తెలియపరిచారు.
జిల్లా వనరుల కేంద్రం నుండి వచ్చినటువంటి ఏవీఎస్ రాజశేఖర్ ఏడిఏ మాట్లాడుతూ సామూహిక ఎలుకల నివారణకు వరి నూకలతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నటువంటి బ్రోమాడియోలిన్ ఎలుకుల మందును ఏ విధంగా కలపాలో రైతులకు వివరించడం జరిగినది.
ఒక హెక్టారుకు 480 గ్రాములు వరి నూకలలో 10 గ్రాములు వంటనూనె బాగా కలుపుకొని దానిలో 10 గ్రాములు బ్రోమాడియోలిన్ ఎలుకల మందును బాగా పట్టించవలెను.వీటిని 10 గ్రాముల చొప్పున పొట్లం గా కట్టుకుని ముందుగా గుర్తించిన ఎలకల బొరియల దగ్గర పెట్టుకున్నట్లయితే ఎలుక వీటిని తిన్న రెండు మూడు రోజులకు చనిపోవడం జరుగుతుందని రైతులకు వివరించడం జరిగింది.
సహాయ వ్యవసాయ సంచాలకులు ఆలమూరు కే నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎలుకల వలన కలుగు నష్టాన్ని గురించి వివరించడం జరిగింది.ఎలుకలు పై పళ్ళు ప్రతిరోజు కూడా 0.4 మిల్లీమీటర్లు పెరుగుతూ ఉంటాయని ఈ విధంగా పెరుగుతూ ఉంటే అవి కపాలంలో గుచ్చుకుని తనకు తానుగా ఎలుక చనిపోతుందని దీని నుండి రక్షించుకోవడానికి ప్రతి రోజు కూడా ఏదో ఒక వస్తువును పాడు చేస్తూ వాటి పళ్ళను అరగదీసుకుంటూ ఉంటుందని దీనివలన సంవత్సరం పొడవును కూడా ఎలుక ఏదో ఒక దానిని కొరుకుతూ పళ్ళు అరగదీసుకోవాలని రైతులకు వివరించడం జరిగింది.అదేవిధంగా ఎలుకలు వరి పొలంలో అవి తీసుకునే ఆహారం కన్నా 7,8 రెట్లు ఎక్కువగా వరి ధాన్యాన్ని పాడు చేస్తాయని దీనివలన దిగుబడిపై అధిక ప్రభావం చూపుతుందని,అందువలన రైతులు అందరూ కూడా సామూహికంగా ఎలుకలను నివారించాలని విజ్ఞప్తి చేశారు.తదుపరి రైతులందరికీ కూడా వరి నూకలలో కలిపిన ఎలుకల మందును అధికారులు మరియు గ్రామ నాయకుల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.అదేవిధంగా క్షేత్రస్థాయిలో ముందు రోజు గుర్తించినటువంటి ఎలుకల బొరియలు దగ్గర రైతులచే 10 గ్రాములుగా కట్టిన పొట్లాలను పెట్టించడం జరిగినది.
ఈకార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి జే మనోహర్,గ్రామ సర్పంచ్ అరిఫ్,ఉప సర్పంచ్ ఆదినారాయణ,ఎంపీటీసీ సభ్యులు కే అప్పారావు,గ్రామ నాయకులు ఎస్ నాగేంద్ర శ్రీనివాస్,గ్రామ వ్యవసాయ సహాయకులు చొల్లంగి హరిబాబు,అజయ్
అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.