సుపరిపాలనకు తొలి అడుగు లో ఎమ్మెల్యే తో ఎంపీ…
కూటమి ప్రభుత్వ విజయాలను తలుపు తట్టి గడపగడపకు వివరించడమే సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం అని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ అన్నారు. ఆదివారం మండపేట మండలంలోని ఏడిద గ్రామాలలో ఎంపీ తో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావుతో కలసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులను, మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేసి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో భాగంగా మొదటగా రాష్ట్రంలో పింఛన్ల పండగ నెలకొందన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా నగదు తల్లి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లతో మహిళల్లో ఆనందం వెల్లువిరుస్తుందన్నారు. ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేస్తుందన్నారు. ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందన్నారు. ప్రజలలో కూటమిపై అపారమైన నమ్మకం కలిగిందన్నారు. కూటమి ప్రభుత్వ విజయాలను తలుపు తట్టి ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం సుపరి పాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.