తన చిన్ననాటి నుంచి ఆమె తండ్రి పోలీసుగా దొంగలను పట్టుకోవడం దగ్గరి నుంచి గమనించిన ఆ చిన్నారి తను కూడా పెద్దయ్యాక తన తండ్రిలాగే ఎప్పటికైనా పోలీస్ కావాలని చిన్నప్పుడే నిశ్చయించుకుంది. అక్కడితో ఆగకుండా డిగ్రీ పూర్తి అయినప్పటి నుంచి పోలీస్ ఉద్యోగం సాధించేందుకు అహర్నిశలు శ్రమించింది .ఎంతో కష్టపడి చివరకు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది ఆ యువతే సంసాని జ్యోతి. కాట్రేనికోన మండలం నడవపల్లి కి చెందిన సంసాని జ్యోతి డిగ్రీ వరకు చదివింది. ఆమె తండ్రి సంసాని శ్రీనివాసరావు కాట్రేనికోన పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. తల్లి సత్యవేణి గృహిణి. తండ్రిలా పోలీస్ కావాలని లక్ష్యంతో ఎస్సై ఉద్యోగానికి ప్రయత్నించి త్రుటిలో అవకాశం కోల్పోయింది. అయినా కుంగిపోకుండా, పట్టు వదలకుండా కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రయత్నించింది. మూడు ఏళ్ల కాలం నుంచి ఎటువంటి కోచింగ్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటూ అహర్నిశలు కష్టపడి చదివింది. శుక్రవారం వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో సివిల్ కానిస్టేబుల్ గా విజయం సాధించింది. తన తండ్రి లాగానే పోలీసు శాఖలో పనిచేసి ప్రజలకు, సమాజ సేవ చేయాలని తపనతో ఈ ఉద్యోగం సాధించాలని జ్యోతి తెలిపింది. ఎప్పటికైనా ఎస్సై ఉద్యోగం సాధిస్తానని తెలిపింది. చదువుకునే రోజుల్లో చదువులోనూ ప్రతిభ చూపించిన జ్యోతి 2014 పదో తరగతి ఫలితాల్లో కాట్రేనికోన మండల ఫస్ట్ వచ్చింది. చిన్ననాటి నుంచి కన్నా కలను సాధించి పోలీసు శాఖలో అడుగు
పెడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు.