23 October 2025
Thursday, October 23, 2025

తుఫాను, అధిక వర్షాల సమయంలో వరి పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

పలు సూచనలు చేసిన మండల వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేష్ కుమార్

విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం

రాష్ట్రం లో తుఫాను వర్షాల హెచ్చరికల నేపధ్యంలో రాష్ట్ర వరి రైతాంగం దిగువన ఉదహరించిన జాగ్రత్తలు చేపట్టి పంట నష్టాన్ని నివారించుకొవాలని మండల వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేష్ కుమార్ గురువారం పలు సూచనలు చేశారు.

కోతకి సిద్దంగా ఉన్న వరి పంటని వర్షాలకు ముందు కోయరాదని, కోసిన పూర్తిగా ఆరని పనలను తుఫాను వాతావరణ నేపధ్యంలో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనల పై చల్లుకుంటూ కుప్ప వేసుకోవడం ద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చు. కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేవిధంగా పిచికారీ చేయాలి. ఒక వేళ పొలం లో నీరు నిలిచి ఉన్నట్లయితే పనలను గట్ల పైకి తెచ్చుకొని విడగొట్టి ఉప్పు ద్రావణం చల్లుకోవాలి. వర్షాలు తగ్గి ఎండ రాగానే పనలను తిరగేసి ఎండబెట్టి నూర్చుకోవాలన్నారు. కల్లాల మీద ఉన్న ధాన్యాన్ని వర్షానికి తడవకుండా భద్రపరుచుకోవాలి. నూర్చిన ధాన్యం 2-3 రోజులు ఎండ బెట్టడానికి వీలు కాకపోతే కుప్పలలో గింజ మొలకెత్తడమే కాక రంగు మారి చెడు వాసన వస్తుందని, ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించడానికి ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక కలిపి ధాన్యం పోగు పెట్టడం వల్ల గింజ మొలకెత్తకుండా, చెడిపోకుండా నివారించుకోవచ్చు. ఎండ కాసిన తరువాత ధాన్యాన్ని ఎండబోసి, తూర్పార బట్టి నిలవ చేసుకోవాలి. రంగు మారి, తడిచిన ధాన్యం పచ్చి బియ్యం కంటే ఉప్పుడు బియ్యం గా అమ్ముకోవడం వల్ల నష్టాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు. పిగులు పొట్ట, పూత దశ లో పైరు 1 నుండి 2 రోజుల కన్నా ఎక్కువ రోజులు నీట మునిగితే కంకి పూర్తిగా బయటకు రాకపోవడం, పుష్పాలలో నీరు చేరడం వలన ఫలదీకరణ శక్తి కోల్పోయి, తాలు, రంగు మారిన గింజలు ఏర్పడతాయి. గింజ రంగు మారకుండా ఉండటానికి లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండిజం లేదా రెండు గ్రాముల కార్బెండిజం + మాంకోజెబ్ లేదా 1 మీ.లీ ప్రోపికొనజోల్ మందును పిచికారి చేయాలి. పాలు పోసుకునే దశ : ఈ దశలో 2 నుండి 3 రోజులకన్నా ఎక్కువగా పంట నీట మునిగితే పిండి పదార్ధాలు గింజలలో చేరక గింజ బరువు తగ్గి రంగు మారి, తద్వారా దిగుబడి మరియు నాణ్యత తగ్గుతాయి. గింజ రంగు మారకుండా ఉండటానికి లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండిజం లేదా రెండు గ్రాముల కార్బెండిజం,మాంకోజెబ్ లేదా 1 మీ.లీ ప్రోపికొనజోల్ మందును పిచికారి చేయాలి. గింజ గట్టిపడే దశ నుండి కోత దశ చేను పడిపోకుండా ఉండి, నిద్రావస్థ కలిగిన రకాలలో నష్టం తక్కువగా ఉంటుంది. నిద్రావస్థ లేనటువంటి బి.పి.టి 5204 వంటి రకాలు నీట మునిగితే గింజ మొలక వచ్చి నష్టం ఎక్కువగా ఉంటుంది. నిద్రావస్థ ఉన్నరకాలలో కూడా చేను పడిపోయి ఎక్కువ రోజులు నీట మునిగినట్లైతే గింజలలో నిద్రావస్థ తొలిగి చేనుపైనే మొలకవచ్చే అవకాశం ఉన్నది. దీని నివారణకు 5% ఉప్పు ద్రావణాన్ని చేను పై పిచికారీ చేయాలి. గింజ తోడుకునే లేదా గట్టిపడే దశలో వెన్ను యొక్క బరువువల్ల మొక్కలు కొద్దిపాటి గాలి, వర్షాలకే కణుపుల వద్ద విరిగి నేలకి ఒరుగుతాయి. ఈ విధంగా పడిపోవడం వల్ల పిండి పదార్ధం గింజలకు సరిగా చేరక గింజ బరువు తగ్గడం లేదా తాలు గింజలు ఏర్పడటం జరిగి, తద్వారా దిగుబడి తగ్గే అవకాశం ఉన్నది. దీనితోపాటు పడిపోయిన చేల నుండి వచ్చే ధాన్యం రంగు మారి, మిల్లింగ్ సమయంలో విరిగిపోయి, బియ్యం పై మచ్చ వచ్చే అవకాశం ఉన్నది. పడిపోయిన చేల లో యంత్రాలతో కోత కోయడానికి ఎక్కువ సమయం పట్టడం వల్ల కోత కృషిఖర్చు కూడా పెరిగిపోతుంది. నష్ట నివారణకు పడిపోయిన చేలలో వీలైనంత తొందరగా దుబ్బులను లేపి నిలబెట్టి కట్టలుగా కట్టే చర్యలు చేపట్టాలి. దాళ్వా నారు మడి దశలో ఉన్న వరి పంట, విత్తనం చల్లిన 2–3 రోజుల వయసులో ఉన్నప్పుడు, మూడు రోజుల కన్నా ఎక్కువ నీట మునిగితే మొలక శాతం గణనీయంగా తగ్గుతుంది. ఈ దశలో వీలైనంత తొందరగా నీటిని పూర్తిగా బయటకు తీసివేయడం వల్ల విత్తనం కోర గాలి పోసుకొని ఎటువంటి నష్టం జరగదు. అలా కాక నీరు తీయడానికి వీలు లేక మొలక దెబ్బతింటే తిరిగి విత్తనం చల్లుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. విత్తిన 7 నుండి 30 రోజుల మధ్యలో నారుమడి 5 రోజుల కన్నా ఎక్కువగా నీట మునిగితే నారు దెబ్బతినే అవకాశం ఉంది, కాబట్టి నారు నీట మునిగిన 5 రోజుల లోపు, నీటిని పూర్తిగా బయటకు తీసివేసి పంటకు గాలి తగిలేలా చేయాలి. నష్ట నివారణకు నీటిని తీసివేసిన తరువాత, 5 సెంట్ల నారు మడికి ఒక కిలో యూరియా, ఒక కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవడం వలన కొత్త ఆకు వచ్చి ఊడ్పులకు అందుతుంది. అధిక వర్షాలకు నారు మడి దశలో పంట తెగుళ్ళ బారిన పడకుండా, నీరు పూర్తిగా తీసివేసి మొక్క నిలదొక్కు కున్న తరువాత లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండిజం లేదా రెండు గ్రాముల కార్బెండిజం మాంకోజెబ్ కలిసిన మిశ్రమమందు గానీ కలిపి పిచికారి చేయాలి. పంట ఊడ్చిన వెంటనే మరియు పిలక దశలో ముంపుకు గురైనట్లైతే, నీటిని పూర్తిగా బయటకు తీసివేసి తరువాత పైపాటుగా ఎకరాకు 20 కిలోల యూరియా తో పాటు 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అదనంగా వేసుకోవాలి. ఈ విధంగా బూస్టర్ డోస్ వేసుకోవడం వలన మొక్క ముంపు ప్రభావం నుండి త్వరగా కోలుకుంటుంది. మొక్క కోలుకున్న తరువాత కుళ్ళు తెగుళ్ళు రాకుండా లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండిజం కలిపి పిచికారీ చేయాలి. పొలంలో నుల్చున్న నీరు మురుగు కాలువల ద్వారా బయటకు వెళ్ళేటట్లు బాటలు ఏర్పాటు చేసుకోవాలి.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
తెలంగాణ
అలూరి సీతారామరాజు
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo