స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ దగ్గర ధర్మంచర హాలుపైన బుక్ బ్యాంకులో మంగళవారం ఉదయం సమావేశం..
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసినా,మాట్లాడినా అదొక మరపురాని జ్ఞాపకంగా అందరికీ మిగిలిపోతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ని పాలించిన సీఎం లలో డాక్టర్ వైఎస్ ని ఎవరూ మర్చిపోలేరని, హ్యూమన్ టచ్ గల సీఎం డా వైఎస్ అని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సందర్బంగా స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ దగ్గర ధర్మంచర హాలుపైన బుక్ బ్యాంకులో మంగళవారం ఉదయం సమావేశం నిర్వహించారు. డా వైఎస్ చిత్రపటానికి భక్త్యంజలి ఘటించారు.
ఈసందర్బంగా ఉండవల్లి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ తో గల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చాలామందికి డాక్టర్ వైఎస్ తో మరిచిపోలేని అనుబంధం ఉందన్నారు. అంతటి బలమైన ముద్ర అందరి మనస్సులో డాక్టర్ వైఎస్ వేసుకున్నారన్నారు. 1991లో డా వైఎస్ ఎంపీగా ఉండగా కలుసుకోడానికి ఢిల్లీ వెళ్లిన సందర్భంలో నాకు చలికోటు లేకపోవడాన్ని గమనించి, అప్పటికప్పుడు మార్కెట్ కి తీసుకెళ్లి చలికోటు కొనిపించారు. అంతేకాదు, వడదెబ్బ కొడితే ఎలా ఉంటుందో, శీతల దెబ్బ కూడా అంతేనని విడమరిచి చెప్పారు. ఇలా ఎదుటి మనిషి ఇబ్బందిని ముందే గమనించే హ్యూమన్ టచ్ డాక్టర్ వైఎస్ లో ఉంది. మరో సందర్భంలో మా అమ్మగారితో డాక్టర్ వైఎస్ ఐదు నిముషాలు మాట్లాడి, మీ అమ్మతో మాట్లాడితే , మా అమ్మతో మాట్లాడినట్లు ఉంది అన్నారు. ఇలాంటివెన్నో మరిచిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి’ అని ఉండవల్లి ప్రస్తావించారు.
ప్రతి జిల్లాలో పదేసిమంది నాయకులతో డాక్టర్ వైఎస్ కి చాలా దగ్గర చనువు ఉందని, అయితే ఆయన అధికార నివాసంలో డాక్టర్ కెవిపితో పాటు తనకు ఉండే అవకాశం దక్కడం మరిచిపోలేనిది ఉండవల్లి అన్నారు. ఇందిరాగాంధీ పేదప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారో , డాక్టర్ వైఎస్ కూడా అలాగే నిలిచేవుంటారని ఆయన అన్నారు.
మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ తాను శాసనసభ్యునిగా ఉండగా ఉండవల్లి అరుణ కుమార్, జక్కంపూడి రామమోహన్ రావు ల సహకారంతో ఎన్నోఅభివృద్ధి కార్యక్రమాలు చేసామంటే అందుకు డాక్టర్ వైఎస్ పూర్తిగా సహకరించడమే కారణమని అన్నారు. నల్లా ఛానల్ కి నిధులు వచ్చినా, పేదలకోసం వందెకరాల స్థలం అందునా 36ఎకరాలు ఎండోమెంట్ స్థలాన్ని సేకరించినా, గామన్ బ్రిడ్జి , ఆర్టీసీ స్థలంలో వర్షపు నీటి నిల్వ కోసం చెరువు తవ్వినా, జాంపేట రైలు వంతెన .. ఇలా ఏది అడిగినా ఓ ఎస్ అంటూ డాక్టర్ వైఎస్ ధైర్యంగా ఒకే చేసారని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఛాంబర్ పూర్వాధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి, ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టడం ద్వారా దేవుడు అయ్యారని కీర్తించారు. ఇది ప్రతక్షంగా చూశానని ఆయన ఆసుపత్రిలో చూసిన ఘటనలను ప్రస్తావించారు. అది నిజమని నమ్మితే ముందూ వెనక చూడకుండా ధైర్యంగా చేయగల ముఖ్యమంత్రులుగా ఎన్టీఆర్, డాక్టర్ వైఎస్ నిలిచిపోతారని అన్నారు. వస్త్ర వ్యాపారులకు ఇబ్బందిగా ఉన్న ఆర్డినెన్స్ ని క్షణాల్లో తొలగించిన ఘనత ఎన్టీఆర్ దని, అలాగే మెడప్ టాక్స్ వలన ఇబ్బంది గమనించి రద్దుచేసి ఘనత డాక్టర్ వైఎస్ దని ఆయన ప్రస్తావించారు. డాక్టర్ వైఎస్ కారణజన్ముడని అన్నారు.
నక్కా శ్రీనగేష్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రణయోధుడు, పోరాట యోధుడని కీర్తించారు. డాక్టర్ వైఎస్ తో గల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఒకటి రెండు సంఘటనలను ప్రస్తావించారు. పాత్రికేయుడు వి ఎస్ ఎస్ కృష్ణకుమార్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో మానవీయ కోణం ఉందన్నారు. బెజవాడ రంగారావు మాట్లాడుతూ, కార్యకర్తలకు డాక్టర్ వైఎస్ ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో మరువలేనిదన్నారు. పెదిరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అయ్యరక కులానికి గుర్తింపు, పదవులు కూడా డాక్టర్ వైఎస్ కారణంగానే వచ్చాయని గుర్తుచేసుకున్నారు. ప్రసాదుల హరినాధ్, పసుపులేటి కృష్ణ, ఎల్ వెంకటేశ్వరరావు, కె. ఎల్. భాస్కర్, వాకచర్ల కృష్ణ, వేలూరి శరత్, అందనాపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ వీడియో ప్రదర్శన జరిగింది.

